YCP- Rajya Sabha Members: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టుంది ఏపీ సీఎం జగన్ తీరు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన బీసీ నాయకులు ఎంతో మంది ఉండగా.. ఆర్.క్రిష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ కట్టబెట్టడంపై వైసీపీలోని బీసీ నేతలు కుతకుత ఉడికిపోతున్నారు. ఎప్పుడూ పార్టీయే మనకు ఫస్ట్.. తరువాతే మనం.. అంటూ చెప్పుకొచ్చే జగన్ తనకు మాత్రం ఆ నిబంధన వర్తించదన్న కోణంలో వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా పనికి వస్తాడనుకున్న క్రిష్ణయ్య, తన కేసులు వాదిస్తున్న వ్యక్తిగత లాయర్ నిరంజన్ రెడ్డి, 2019 ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇదేం ఎంపిక అంటూ సీనియర్ నేతలు సైతం రుసరుసలాడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో అధినేత తీరును తప్పుపడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం సామాజిక సమతూకం పాటిస్తున్నామని చెబుతోంది. పెద్దల సభకు.. పెద్ద వ్యక్తులను ఎంపిక చేసినట్టు వాదిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురులో..ఇద్దరు బీసీలు కాగా… మిగిలిన ఇద్దరు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం. 2014లో ఆర్.కృష్ణయ్య ఎల్‌బీనగర్ నుంచి తెలంగాణ శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు నాయుడు ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’గా కూడా ప్రకటించారు. ఇక… బీద మస్తాన్ రావు కావలి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఆ ఇద్దరిదీ తెలంగాణ..
వైసీపీ ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు అచ్చంగా తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా. మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. బీసీ ఉద్యమ నాయకుడు. ఇక… ఏలేటి నిరంజన్ రెడ్డి నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో జన్మించారు. 1992లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న నేతలు, వైసీపీలోనూ బీసీ వర్గానికి చెందిన నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ… తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి సీఎం జగన్‌కు వ్యక్తిగత న్యాయవాది.
Also Read: YSRCP -Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపికలో వైసీపీ వ్యూహమేంటి?
జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను ఆయన వాదిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా నియమించారు. లక్షలకు లక్షలు ఫీజులు కూడా చెల్లించారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ చిత్ర నిర్మాతల్లో నిరంజన్ రెడ్డి కూడా ఒకరు! ఇక… విజయసాయి రెడ్డి జగన్ కుటుంబ కంపెనీల ఆడిటర్‌గా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు! వచ్చేనెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు.. జగన్ ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్లో… బీద మస్తాన్ రావు, విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.
అలీ, క్రుపారాణికి నిరాశే..
‘తీపి కబురు’ కోసం ఎదురు చూస్తున్న సినీ నటుడు అలీకి మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఇటీవల తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను అలీ కుటుంబ సభ్యులతో సహా కలిశారు. త్వరలోనే వైసీపీ కార్యాలయం నుంచి తీపి కబురు వస్తుందని సీఎం చెప్పారని అలీ వెల్లడించారు. దీంతో… ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమైనట్లేనని అంతా భావించారు. కానీ… అలీకి ఆ అవకాశం దక్కలేదు. మైనారిటీ వర్గానికి చెందిన వారెవరికీ చాన్స్ లభించలేదు. అలాగే… నాలుగు స్థానాల్లో ఒకటి మహిళలకు కేటాయిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. నామినేటెడ్, ఇతర పదవుల్లో 50 శాతం మహిళలకే ఇస్తామని జగన్ గతంలో గొప్పగా చెప్పారు. మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందంటూ వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గానికి చెందిన ఆమెకు పదవి దక్కుతుందని ఆ ప్రాంతానికి చెందిన వారు ఆనందించారు. కానీ… ఈసారి మహిళలందరికీ జగన్ ‘సారీ’ చెప్పేశారు.
Also Read:CM Jagan Meetings: జగన్ సభలకు ముఖం చాటేస్తున్న జనం.. గేట్లు దాటి పరుగెడుతున్నారెందుకు?
Recommended Videos