ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంగతి అందరికీ తెలిసిందే. అధికార పక్షానికి మద్దతిచ్చే మీడియా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదనేది పాత విషయమే. ఒక్క అధికార పార్టీకి చెందిన మీడియా తప్ప.. మరే మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించే స్థితిలో లేవు. అధికార పక్షం పట్ల ‘పచ్చ’పాతం పాటిస్తున్నాయనేది ఎవరిని అడిగినా చెబుతారు. ఏ మీడియాలో ఏ పార్టీకి భజన చేస్తూ వార్తలు వస్తాయో సగటు రీడర్‌ను అడిగినా చెబుతాడు. అసలు ఆ పేపర్ చదవకున్నా.. ఆ చానల్‌ను వాచ్ చేయకున్నా ఆ మీడియా ఏ పార్టీకి సపోర్టు అంటే ఏ ప్రేక్షకుడిని అడిగినా ఇట్టే సమాధానం ఇస్తాడు. అందుకే.. పాఠకులు అక్కడ పెద్దగా మీడియా ఆదరించడం లేదనేది స్పష్టం అవుతోంది. అక్కడి పాత్రికేయ ప్రమాణాలు పడిపోతుండడంతో పెద్దగా రీడర్స్ కూడా ఖాతరు చేయడం లేదు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎవరైనా పార్టీ సాధించిన విజయాలు.. భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ ఉంటారు. కానీ.. అదేంటో ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ముఖ్యమైనట్లుగా నేతలు ప్రసంగించారు. ఇంకా దీనికి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ ఇంకా అద్భుతమనే చెప్పాలి. టీడీపీకి మద్దతుగా భావించే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చంద్రబాబు ప్రసంగాన్ని కవరేజీ చేసిన విధానం వైవిధ్యాన్ని చాటింది. ప్రతి అక్షరంలోనూ అంతరార్థం కనిపించింది. ప్రతిపదంలోనూ భావం, ఉద్దేశం ఉన్నాయి. రాజకీయ వార్తల్లో తనదైన దూకుడు కనబరిచే ఆంధ్రజ్యోతి విషయం చెప్పడం కంటే భావోద్వేగం కలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మరోవైపు అంకెల ఆధారంగా అసలు విషయం చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ఈనాడు పరిమితమైంది.
రాజకీయాల్లో పార్టీల జాతకాలను సెంటిమెంట్లు నిర్ణయిస్తుంటాయి. నేతల అదృష్టాన్ని తారుమారు చేస్తుంటాయి. తెలుగు జాతి ఆత్మాభిమానం అంటూ ఎన్టీయార్ టైమ్‌లో టీడీపీ పవర్‌లోకి వచ్చింది. స్వరాష్ట్రం సొంత పాలన అంటూ టీఆర్‌ఎస్ గద్దెనెక్కింది. అదంతా సెంటిమెంటు చలవే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన పదకొండు నెలల కాలంలో 70 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే, 79 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో ధ్వజమెత్తారు. నిజానికి టీడీపీ ఆవిర్భావ వేడుకలో దాని ప్రస్తావన అక్కర్లేదు. అయినా రాజకీయ నాయకులు ఏ వేదికనూ ఊరకే వదిలిపెట్టరు కదా.
అదే సమయంలో ఆంధప్రదేశ్ పై తన కలలను చిదిమేశారంటూ అమరావతి గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల వెక్కిరింతలను భరించాల్సి వస్తోందంటూ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలంగాణలో ఒక ఎకరం పొలం అమ్మితే, ఆంధ్రాలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చన్న కేసీఆర్ కామెంట్ ఏపీకి అవమానం అన్న రీతిలో బాబు ప్రస్తావించారు. ఆదాయం కంటే అప్పు పెరిగిపోయిందంటూ చివరకు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన పత్రిక అయిన ఈనాడు అదే అంశాన్ని ప్రధాన శీర్షికగా తీసుకుంది. కానీ.. ఆంధ్రజ్యోతి సెంటిమెంటు సెగ పెట్టేందుకు పొరుగు రాష్ట్ర నేతల విమర్శను, వెక్కిరింతను హైలెట్ చేసేందుకు ప్రయత్నించింది.
సంక్షేమ రాజ్యం కొనసాగుతున్న క్రమంలో రాజకీయ విమర్శలు పెద్దగా ప్రజలపై ప్రభావం చూపడం లేదు. అప్పులు, ఆదాయం, ఓటర్లను ప్రభావితం చేసే అంశాల జాబితా నుంచి తొలగిపోయాయి. దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆక్రోశం వెలిబుచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను పట్టించుకోకుండా ప్రజలు కూడా తమ వాటా కోసం అర్రులు చాస్తున్నారంటూ పరోక్షంగా నిందించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. ఇదంతా రాధాకృష్ణకున్న వ్యక్తిగత అభిప్రాయం. పదకొండు నెలల కాలంలో 79 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం కంటే తెలంగాణ నాయకులు దెప్పి పొడవడమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ప్రధానమైపోయింది. అదే ఏపీ ప్రజలను బాధిస్తుందన్నట్లుగా వార్తను తీసుకున్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి నష్టపోయామనే భావన ఏపీ ప్రజల్లో ఇప్పటికీ ఉంది. దీనికితోడు ఇప్పుడు తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారికి ఎక్కడో మంట పుట్టిస్తున్నాయి. దానిని తట్టి లేపడమే ఆంధ్రజ్యోతి పనిగా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? అన్న రీతిలో చంద్రబాబు నాయుడి అంతర్గత ఉద్దేశానికి పరోక్షంగా అద్దం పట్టింది ఆంధ్రజ్యోతి.
గతంలో ఎన్నడూ లేనంతగా మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రెండు పత్రికలు అంటూ జ్యోతి, ఈనాడులను బోనులో నిలబెట్టారు. ప్రజా శల్యపరీక్షకు గురి చేశారు. తర్వాత సొంత మీడియా సాక్షి వచ్చిన తర్వాత మీడియాలో అంతవరకూ ఉన్న ముసుగులు తొలగిపోయాయి. స్పష్టమైన విభజన ఏర్పడింది. ప్రస్తుతం ఏ మీడియా చెప్పిన వార్తనైనా అంతసులభంగా ప్రజలు నమ్మడం లేదు. ప్రతీ వార్తా కథనానికి పాఠకులే ఉద్దేశాలను ఆపాదించుకుని అనుమానంగా చూస్తున్నారు. ఇదే ధోరణి ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అయితే.. మీడియా మనుగడకు ప్రమాదమేనని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: People dont trust telugu media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com