Presidential Election- AP- Telangana Politics: రాష్ట్రపతి ఎన్నికల పుణ్యమా అని తెలుగునాట రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ఎవరికి ఎవరు మద్దతు తెలుపుతున్నారో? ఎందుకు బలపరుస్తున్నారో తెలియని అయోమయ దుస్థితి. ఇటు ఏపీలోనూ. అటు తెలంగాణలోనూ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న వైసీపీ, టీడీపీలు రెండూ ఎన్డీఏ బలపరచిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. అటు తెలంగాణలో సైతం అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపాయి. అయితే సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ పార్టీ ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. ద్రౌపది ముర్ము విషయంలో తొలి నుంచి వైసీపీ బాహటంగానే మద్దతు ప్రకటించింది. దీనికి కారణాలు లేకపోలేదు. తనపై కేసులు, కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్రంలో టీడీపీ, జనసేన వైపు బీజేపీ మరలకుండా ఉండేందుకు జగన్ బాహటంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఏకంగా నామినేషన్ ప్రక్రియకు సైతం పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి పంపించారు.
వీర విధేయత..
అటు వైసీపీ ఎంపీలు సైతం బీజేపీ అధిష్టానంపై వీర విధేయత ప్రదర్శించారు. అవును తాము గత మూడేళ్లుగా బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నామని బాహటంగా చెప్పుకొస్తున్నారు. అయితే ఇదంతా కేసుల భయంతోనేనని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదు. గత ఎన్నికల్లో టీడీపీ దూరం చేసుకోవడంతో బీజేపీ వైసీపీకి దగ్గరయ్యింది. ఎన్నికల్లో వ్యవస్థల రూపంలో బీజేపీ సహకరించడంతో వైసీపీ అంతులేని విజయాన్ని పొందింది. అటు చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకున్నారు. నాడు జగన్ ట్రాప్ లో పడి ఇరుక్కున్నారు. అయితే అదే తప్పు జరగకుండా జగన్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో అవకాశం వచ్చింది. అటు సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో బీజేపీ కూడా జగన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.
చంద్రబాబు అలెర్ట్..
అయితే అదే సమయంలో చంద్రబాబు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్త పడ్డారు. బీజేపీని వదులుకుంటే మాత్రం మరోసారి ఫెయిల్ అవ్వడం ఖాయమని భయపడ్డారు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి సంఖ్యా బలం తక్కువగా ఉన్నా.. బీజేపీ అడగకుండానే సామాజిక కోణాన్ని తెరపైకి తెచ్చి ముర్ముకు మద్దతు ప్రకటించారు. అంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి సైతం ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వైసీపీ, టీడీపీలకు మంచి చాన్స్ వచ్చిందని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎన్డీఏ అభ్యర్థి కూటమికి ఓటు వేయాలని కోరింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల మాట దేవుడెరుగు.. ముందు తమ గ్రిప్ నుంచి బీజేపీ జారిపోకుండా పోటీపడి మరీ వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నాయి. మేము ఎలాగూ ఉన్నాం. వారితో ఏం పని అన్నట్టు జగన్ ఇప్పటికే బీజేపీ పెద్దలకు విన్నవించినా వారు వినలేదు. ఎవరి అవసరం ఎప్పుడొస్తుందోనని చంద్రబాబును కూడా కాస్తా పక్కన పెట్టుకోవడం ప్రారంభించారు. ఏపీలో ఒకే ఒరలో వైసీపీ, టీడీపీలు చేరడం జాతీయ స్థాయిలో అయితే మాత్రం చర్చీనీయాంశంగా మారింది. ఇరు పార్టీల అధినేతల అవసరాల మేరకు బలవంతంగా మద్దతు తెలుపుతున్నారని జాతీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ రెడ్డి దూకుడు…
అటు తెలంగాణలో సైతం విరుద్ధ భావజాలం గల అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ లు రాష్ట్రపతి ఎన్నికల పుణ్యమా అని ఒకే వేదికపైకి వచ్చాయి. విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం తీసుకుంది. భావసారుప్యత కలిగిన అన్ని పార్టీలతో కూటమి కట్టి అభ్యర్థిని ఎంపిక చేశాయి. తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పపవర్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఆయన పోటీకి ససేమిరా అన్నారు. దీంతో ఒకప్పటి బీజేపీ నేత, ప్రస్తుతం టీఎంసీలో ఉన్న యశ్వంత్ సిన్హాను కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. తొలుత కూటమికి దూరంగా ఉన్న టీఆర్ ఎస్ తరువాత మద్దతు ప్రకటించింది. నామినేషన్ ప్రక్రియకు స్వయంగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరుకాలేదు. టీఆర్ఎస్ తో అసలు వేదిక పంచుకోబోమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దూరం పాటిస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఎంతో టీఆర్ఎస్ అంతేనని తేల్చిచెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీ ఓ లైన్ తీసుకున్నందున కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓట్లు వేయనున్నట్టు ప్రకటించారు. అంతేగాని టీఆర్ ఎస్ తో అంటగాకే పని చేయబోమని మాత్రం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విభేధించుకునే పార్టీలు బీజేపీకి సపోర్టు చేసే విషయంలో మాత్రం ఒకే గొడుగు కిందకు రావడం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.