
దాదాపు ఏడెనిమిదేళ్లుగా.. కాంగ్రెస్ చతికలపడిపోతోంది. హస్తం హస్తగతం అవుతోంది. పోటీ చేసిన అన్నింటా ఓటమిపాలవుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం పార్టీ విషయంలో అంకితభావం కనిపించడం లేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. పార్టీకి తామే తోపులమని భావిస్తూ… కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారు. సీనియర్ నేతలే తమకు పదవులు కావాలంటూ… తమ వర్గాన్ని ప్రోత్సహిస్తుండడం అనేకచోట్ల కాంగ్రెస్ ను కష్టాల్లోకి నెట్టేస్తోంది. దీంతో పార్టీని వీడేందుకు నేతలు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కేరళ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే జరుగుతోంది.
కేరళా ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంత ఊపుఉంది. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కేరళలో గెలుస్తామన్న ఆశ కాంగ్రెస్ కు చాలా ఉంది. కానీ కేరళ కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీని విజయం వైపు నడిపించలేకపోతున్నారు. తమ స్వార్థంకోసం పార్టీని బలి చేస్తున్నారు. తాజాగా కేరళలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీ చాకో పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వర్గ విభేదాల కారణంగానే కాంగ్రెస్ ను వీడారన్న చర్చ జరగుతోంది.
కేరళ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఉమెన్ చాందీ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. మరోవర్గానికి రమేశ్ చెన్నితాల నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలోనూ.. వీరిద్దరే పై చేయి కనిపిస్తోంది. పీసీ చాకో మాటల్లోనే చెప్పాలంటే.. కేరళ కాంగ్రెస్లో ఐ, ఏ గ్రూపులు ఉన్నాయి. వీరిని నియంత్రించేందుకు అధిష్టానం సైతం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
కాంగ్రెస్లో పీసీ చాకో సీనియర్ నాయకుడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. కేరళా ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా రాజకీయంగా కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖను పీసీ చాకో నేరుగా సోనియా గాంధీకి పంపించారు. ఇలాంటి నేతలు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అసలే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించాల్సిన సీనియర్ నేతలు వర్గాలుగా విడిపోవడం.. ఆ పార్టీ భవిష్యత్ ను తెలియజేస్తోంది.