ఏపీలో ఇసుకమొత్తం ఒకే కంపెనీకి కట్టబెట్టడంపై దుమారం రేగుతోంది. విపక్ష పార్టీలన్నీ కివడ్ ప్రో కో కింద జగన్ మోహన్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపిస్తున్నాయి. అసలు ఇసుక తవ్వకాల్లో అనుభవం లేదని కంపెనీ. వేల కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎందుకు టెండరు కట్టబెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి రెండుకోట్ల టన్నుల ఇసుక తవ్వే కంపెనీకి తొమ్మిది లక్షల టన్నుల ఖనిజం తవ్విన అనుభవం ఉంటే చాలని ఎందుకు నిబంధన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమపై వస్తున్న అరోపణల విషయంలో అధికారుతో సమాధానం ఇప్పిస్తోంది. ప్రజాధనం పెట్టి ప్రకటనలు ఇప్పిస్తోంది.
కానీ అందులో విపక్షాలు మౌలికంగా లేవనెత్తుతున్న అనుమానాలేవీ తీర్చడం లేదు. ప్రయివేటుకు ఇసుక అప్పగింతలో ఎన్నెన్నో ఆరోపణలు.. ఇసుకను ఏకమొత్తంగా ప్రయివేటు కంపెనీకి కట్టబెట్టడం.. రెండేళ్లకు కలిపి ప్రభుత్వానికి ఏడెనిమిది వందలకోట్ల చిల్లర మాత్రమే వస్తుండడంతో విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. లెక్కలు చెప్పి మరీ ప్రశ్నలు సంధిస్తున్నాయి. దీంతో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ మీడియా ముందుకు వచ్చి విపక్షాల ఆరోపణలకు సమాధానం చెబుతున్నారు. ఆయన ఆ ప్రయివేటు కంపెనీపై ఎక్కడ లేనంత ప్రేమ ఒలకబోశారు.
ఎంత చేసినా.. ఆ కంపెనీకి రూ.70కోట్లే మిగులుతాయంటున్నారు. అయితే ద్వివేదీ చెప్పిన లెక్క ప్రకారం.. ఏడాదికి రెండుకోట్ల టన్నుల ఇసుక తీస్తేనే అంత. టీడీపీ నేతలు.. అంత మొత్తం తీస్తారన్న నమ్మకం ఏమిటని.. అనధికారికంగా మరో రెండుకోట్ల టన్నుల ఇసుక దోపిడీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రోజూవారీగా ఏపీలో తవ్వుతున్న ఇసుక లెక్కలను వారు చెబుతున్నారు. నేరుగా సమాధానం ఇవ్వకుండా రూ.కోట్లతో పేపర్ ప్రకటనలు.. విపక్షాలు లేవనెత్తిన సందేహాలు.. చేస్తున్న ఆరోపణలపై సరైన సమాధానాలు దొరకకపోవడంతో.. ప్రభుత్వం పేపర్ ప్రకటన ఇచ్చింది.
కొసమెరుపు ఏంటంటే. గతంలో ఆన్ లైన్ ద్వారా ఇసుక.. ఇంటివద్దకే ఇసుక పంపిణీ కూడా అద్భుతమైందని.. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు ప్రయివేటుకు అప్పగించినా కూడా.. అదే తరహా ప్రకటనలు కోట్లు ఖర్చు చేసి ఇస్తున్నారు. మెరుగైన పాలసీలు అయితే ఇన్నిసార్లు ఎందుకు మార్చాలి..? ఇసుక విషయంలో ఇప్పటి ఏపీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. రవాణా ఖర్చులుమాత్రం పెట్టుకునేవారు. ఎప్పుడూ ఇసుక బ్లాక్ అనే మాట వినిపించలేదు. కానీ.. ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక బంగారం అయిపోయింది. ధర పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి.. ఒకే ప్రయివేటు కంపెనీకి మొత్తం కాంట్రాక్టు కట్టబెట్టేసి… అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిపై తప్పడు ప్రచారం అనే ముద్రవేసి సరిపెడుతున్నారు.