Pawan Kalyan Varahi Yatra: పవన్ అంటే మిగతా రాజకీయ పక్షాలకు ఒక రకమైన జలసీయే. రెండుచోట్ల ఓడిపోయినా పవన్ మేనియా తగ్గలేదు. ఓడించిన ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలు బ్రహ్మస్త్రంగా మారుతున్నాయి. పవన్ ఎక్కడున్నా.. ఏ స్థానంలో ఉన్న విపక్షాలకు మాత్రం రాజులాగే కనిపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు పవన్ చర్యలేవీ మింగుడు పడడం లేదు. తమ అధికారానికి గండి కొట్టేలా వారికి కనిపిస్తున్నారు. అందుకే అయినదానికి.. కానిదానికి పవన్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ అంటేనే భయపడే కొంతమంది వైసీపీ నేతలు బయటకు మాత్రం గాంభీర్యంగా కనిపిస్తున్నారు. అటువంటి వారంతా పవన్ వారాహి యాత్ర చేపడుతుండడంతో డైపర్లు తడుపుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసైనికుల నోటి నుంచి ఇటువంటి మాటలు వెలువడుతుండడంతో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అన్నవరం టు భీమవరం వరకూ యాత్రను తొలివిడత ఫిక్స్ చేశారు. సాధారణంగా పవన్ పొలిటికల్ టూర్ అంటేనే ఒక రకమైన హీట్ ఉంటుంది. అటువంటిది వారాహి యాత్ర అనేసరికి రాజకీయ మరింత వేడెక్కే అవకాశముంది. ఇప్పటికే వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు,గుడివాడ అమర్నాథ్ , మంత్రులు పేర్ని నాని, గుడివాడ నాని సహా పలువురు నేతలు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పవన్ యాత్రను చంద్రబాబు కోసం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన వైసీపీల మధ్య మాటలు సహా ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. ప్రకాశం, విశాఖ, గోదావరి జిల్లాల్లో వరుస ఘటనలు హీటెక్కించాయి.
తాజాగా జనసేన నాయకులు వైసీపీ మంత్రులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైసీపీ మంత్రులు డైపర్లు కొనుక్కోవాలని తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వారాహి యాత్ర తర్వాత.. వైసీపీకి చలీ జ్వరం రావడం ఖాయమని.. అప్పుడు కూర్చున్న చోట నుంచి పడుకున్న చోట నుంచి కూడా లేవలేరని.. అలాంటి సమయంలో డైపర్లు చాలా అవసరం అవుతాయని రాయల్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ జనసేనలో కీలక నాయకుడు. గతంలో చాలాసార్లు వైసీపీ ఆయనపై అటాక్ చేసిన సందర్భాలున్నాయి. పవన్ విశాఖలో ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ సర్కారు కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసింది. అటువంటి కిరణ్ రాయల్ ఇప్పుడు పవన్ టూర్ సమయంలో వైసీపీని టార్గెట్ చేశారు. వారాహి తరువాత వైసీపీ నాయకులకు ముఖ్యంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, ఆర్కే రోజా, కొడాలి నాని , పేర్ని నానికి డైపర్లు అవసరముంటాయని కామెంట్స్ చేశారు. ఆన్ లైన్ లో మంచి ఆఫర్లలో డైపర్లు దొరుకుతున్నాయని..మీలో మీకే పోటీ వచ్చి దొరక్కపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దొరకని వారు తమను సంప్రదిస్తే మీ ఇంటికే డైపర్లు పంపిస్తామని కిరణ్ రాయల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే దాడులకు, ప్రతి విమర్శలకు ముందుండే వైసీపీ బ్యాచ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.