
Pawan target fix: వాస్తవానికి దగ్గరగా ఉన్న వ్యాఖ్యలు చేయడంలో పవన్ ముందుంటారు. ముక్కుసూటిగా తాను అనుకున్నది కుండబద్దలు కొట్టి మాట్లాడతారు. రాజకీయ ప్రయోజనాలకు అసలు పరిగణలోకి తీసుకోరు. కాస్తా ఆవేశంగానే మాట్లాడతారు. రాజకీయ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ లు ఇస్తారు. అయితే ఈ సారి వ్యూహం మార్చారు. పదో ఆవిర్భావ సభల్లో ప్రత్యర్థుల కంటే తన విజన్, పార్టీ విజన్ పైనే ఎక్కువగా మాట్లాడారు. సుమారు నాలుగు గంటల పాటు పవన్ ఆలస్యంగా సభా వేదికపైకి వచ్చిన ఓర్పుతో ఉన్న జన సైనికులకు సంతృప్తినిచ్చేలా జనసేనాని వ్యాఖ్యాలు సాగాయి. వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పదో ఆవిర్భావ సభలో పవన్ విభిన్నంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా క్లుప్తంగా అన్నింటిపైనే క్లారిటీ ఇచ్చారు. వాస్తవాలను పార్టీ శ్రేణులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. తన విజన్ చెప్పేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈసారి అసెంబ్లీలో జనసేన అడుగు పెడుతుందని స్పష్టం చేశారు. గెలుపుకు అవకాశం ఉన్నచోట మాత్రమే పోటీచేస్తామని చెప్పుకొచ్చారు. ముందుగా పార్టీని, ఎమ్మెల్యేలను మంచి పొజిషన్ లో ఉంచి జనసేనను విస్తరించేందుకు ప్రయత్నిస్తానని కూడా పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చారు. ఎక్కడా ఆవేశపడకుండా గత పదేళ్లలో ఎదురైన గుణపాఠాలను అధిగమించి జనసేన ఏపీలో అతీతమైన రాజకీయ శక్తిగా ఎదగబోతోందని కూడా వ్యాఖ్యానించారు.
మరోవైపు పొత్తులపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. బీజేపీ తగిన విధంగా సహకరించకపోవడం వల్లే టీడీపీ అవసరం లేనంతగా ఎదగలేకపోయామని హాట్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా సంకేతమిచ్చారు. వైసీపీ ఏం వద్దనుకుంటుందో అదే జరుగుతుందన్నారు. టీడీపీ, జనసేన కలిస్తే ఘోర ఓటమి ఎదురవుతుందని వైసీపీ నేతలకు తెలుసన్నారు. అందుకే వారు వద్దనుకుంటున్నారని.. నిర్ణయాలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని.. 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలని సవాల్ చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. తాము ఎవరితో కలిస్తే మీకెందుకు అని ప్రశ్నించారు.
అటు బీజేపీతో పొత్తుపై కొంత స్పష్టతనిచ్చారు. ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని.. అవే కొనసాగితే బీజేపీతో కలిసి నడవడానికి కూడా వెనుకడుగు వేస్తామని చెప్పారు. తాను టీడీపీతో కలిసి నడవడానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించి ఉంటే సొంతంగా ఎదిగే వారమని గుర్తుచేశారు. వస్తే బీజేపీని కలుపుకొని వెళతాం.. రాకుంటే టీడీపీతో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటామని పవన్ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు. తాను చెప్పాల్సింది ఫుల్ క్లారిటీతో చెప్పడంతో జన సైనికులు ఖుషీ అయ్యారు. అధినేత నుంచి కావాల్సింది ఇదే కదా అని ఆనందం వ్యక్తం చేశారు.