Pawan Kalyan : ఈసారి ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలన్న కృతనిశ్చయంతో పవన్ ఉన్నారు. అందుకే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా తాను పోటీచేయబోయే నియోజకవర్గం ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఏ నియోజకవర్గమైతే పార్టీతో పాటు తనకు మైలేజ్ వస్తుందని ఆరా తీస్తున్నారు. ఆ బాధ్యతను ఓ సర్వే సంస్థకు అప్పగించారు. పవన్ రాజకీయ విమర్శలు చేసిన ప్రతీసారి గెలుపు అనే టాపిక్ బయటకు వస్తోంది. ముందు ఎమ్మెల్యేగా గెలిచి మాట్లాడాలని రాజకీయ ప్రత్యర్థులు సవాల్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరంల నుంచి పోటీచేశారు. రెండుచోట్ల తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు. నేరుగా వచ్చి పోటీ చేయడంతో ఓటమే ఎదురైంది. అందుకే ఈ సారి ముందస్తుగా స్టడీ చేసి పోటీకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఏ నియోజకవర్గమైతే సేఫ్? అక్కడ ప్రత్యర్థి పార్టీల బలం? బలహీనతలు తెలుసుకునే పనిలో పవన్ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తమ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని పార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ నుంచి ఎక్కువగా ఆహ్వానాలు అందుతున్నాయి.

అయితే పవన్ ఈసారి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే బరిలో దిగుతారని టాక్ నడుస్తోంది. గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీచేయడం అంటే ప్రచారం, ఇతరత్రా భారం, రాష్ట్రవ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల ఫోకస్ పెట్టాల్సి ఉండడంతో ఒక్క నియోజకవర్గాన్నే ఎంచుకోవాలని ఆయన చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఓ సర్వే సంస్థకు నియోజకవర్గ ఎంపిక బాధ్యత అప్పగించారని.. పనిలో పనిగా అభిమానులు కార్యకర్తలు, ఓట్లుగా మార్చడం ఎలా అన్నదానిపై కూడా సదరు సంస్థ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో లక్షలాది మంది అభిమానులు పవన్ ను ఫాలో అయ్యారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆ స్థాయి విజయాలు దక్కలేదు. అందుకే పవన్ చాలా సందర్భాల్లో మీ అభిమానం.. అభిమానం వరకేఉండిపోయిందని.. ఓట్లు రూపంలో మారలేదని గుర్తుచేశారు. అందుకే ఈ సారి స్లోగన్ ను అభిమానుల్లోకి బలంగా పంపించడం ఎలా? అన్నదానిపై వర్కవుట్ చేస్తున్నారు.
అయితే పవన్ పోటీచేసే నియోజకవర్గాలకు సంబంధించి రెండు ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి కాకినాడ రూరల్, రెండు తిరుపతి, ఇక మూడో ఆప్షన్ గా పిఠాపురంను ఉంచారు. తిరుపతిలో మెగా కుటుంబ అభిమానులతో పాటు కాపు సామాజికవర్గం అధికం. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి తిరుపతితో పాటు సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీచేశారు. పాలకొల్లు నుంచి ఓటమి చవిచూసినా.. తిరుపతి నుంచి మాత్రం అత్యధిక మెజార్టీ సాధించారు. అందుకే సదరు సర్వే సంస్థ సైతం తిరుపతికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ లో అభిమానుల బలంతో పాటు క్యాస్ట్ ఫీవర్ తోడైతే మాత్రం వార్ వన్ సైడేనని భావిస్తున్నారు. ఈ రెండింటి తరువాత పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. ఓటర్లో 80 శాతం కాపులు ఉండడమే అందుకు కారణం. ఇక్కడ నుంచి పోటీచేస్తే ఏకపక్షంగా గెలిపించుకుంటామని పార్టీ నేతలు, అభిమానులు, కాపు సామాజికవర్గం ప్రజలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాలో జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. పిఠాపురంలో అయితే 25 వేలకుపైగా ఓట్లు జనసేన అభ్యర్థికి పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీ గీత వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం సాగుతోంది. కాకినాడ ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడానికి జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే పవన్ కాకినాడ రూరల్ నుంచి కానీ.. పిఠాపురం నుంచి కానీ బరిలో దిగితే కాకినాడ ఎంపీ స్థానాన్ని సైతం కైవసం చేసుకునే చాన్స్ ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే సంక్రాంతి తరువాతే పవన్ ఎక్కడినుంచి పోటీచేస్తారో అనౌన్స్ చేసే అవకాశముందని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.