Satya Dev : చిన్న నటుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా ఎదిగాడు సత్యదేవ్. వైజాగ్ కి చెందిన సత్యదేవ్ ఈ జనరేషన్ హీరోల్లో నటనలో మెళకువలు తెలిసినవాడని చెప్పొచ్చు. సత్యదేవ్ డైలాగ్ డెలివరీ, సీన్ ఇంటెన్సిటీని బట్టి యాక్టింగ్ లో చూపించే వేరియేషన్స్ బాగుంటాయి. ఏదో తెలియని ప్రత్యేకత సత్యదేవ్ సొంతం. హీరోగా ఆయనకు ఇంకా సరైన సక్సెస్ రాలేదు. అందుకే అటు హీరోగా ఇటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఆయన రోల్ కి మంచి పేరు వచ్చింది.

సత్యదేవ్ తాజా చిత్రం ‘ గుర్తుందా శీతాకాలం’. తన ఇమేజ్ కి భిన్నంగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. తమన్నా హీరోయిన్. మేఘా ఆకాష్, కావ్యా శెట్టి సైతం హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్ 9న విడుదలైన గుర్తుందా శీతాకాలం అనుకున్న స్థాయిలో ఆడలేదు. నాగ శేఖర్ దర్శకత్వంలో గుర్తుందా శీతాకాలం మూవీ తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సత్యదేవ్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఒక సందర్భంలో తాను ప్రాణాలు కోల్పోయేవాడినని సత్యదేవ్ భయానక సంఘటన గుర్తు చేసుకున్నారు. ఓ చిత్ర షూట్ కోసం ఆఫ్ఘానిస్తాన్ వెళ్లారట. వెళ్లిన రోజు షూటింగ్ కి పర్మిషన్ దొరకలేదట. దీంతో ఒక్క ఎత్తైన బిల్డింగ్ లో కెమెరాలు పెట్టి ఎవరికీ తెలియకుండా షూట్ చేద్దామని ప్లాన్ చేశారట. ఫోన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇస్తుంటే సత్యదేవ్ నటిస్తున్నాడట. అయితే సత్యదేవ్ కదలికలు చూసిన పోలీసులు సూసైడ్ బాంబర్ అని బ్రమపడ్డారట. అరెస్ట్ చేసి తలకు గన్ గురిపెట్టారట. ఆ సమయంలో సత్యదేవ్ చనిపోతానని డిసైడ్ అయ్యాడట. తన వద్ద ఉన్న పాస్ పోర్ట్ చూపించి, పోలీసులను నమ్మించి ఆ పరిస్థితి నుండి బయటపడ్డాడట.
మలయాళ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీలో సత్యదేవ్ హీరోగా నటించారు. ఆ మూవీలో హీరో విలన్ ని కొట్టేవరకు చెప్పులు వేసుకోనని శబధం చేస్తాడు. పాత్ర సహజంగా రావడానికి ఆ చిత్ర షూట్ పూర్తి అయ్యే వరకు సత్యదేవ్ చెప్పులు లేకుండా నడిచాడట. ఇక క్లైమాక్స్ ఫైట్ లో విలన్, సత్యదేవ్ నిజంగానే కొట్టుకున్నారట. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయాయని, సత్యదేవ్ చెప్పుకొచ్చారు. చిరంజీవికి పెద్ద అభిమానిని అని చెప్పిన సత్యదేవ్… ఆయనతో లంచ్ చేస్తూ సినిమా కథ విన్న సందర్భాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు.