
Pawan Kalyan: ఏపీలో భారతీయ జనతా పార్టీ పయనమెటు? ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్. తమకు జనసేనతో తప్పించి మరెవరితో పొత్తులు లేవని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతుంటారు. తాము వైసీపీ, టీడీపీకి సమదూరమని తరచూ ప్రకటిస్తుంటారు. కలిసి వస్తే జనసనతో వెళతాం.. లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తామని కూడా చెబుతుంటారు. అయితే అదే సమయంలో షరతులు వర్తిస్తాయని ఒకరిద్దరు నేతలు మాత్రం టీడీపీతో కలిసి పోటీచేస్తేనే ఫలితముంటుందని స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అటు పవన్ సైతం టీడీపీతో కలిసి నడిచేందుకు మొగ్గుచూపుతున్నట్టు చెబుతుంటారు. అలాగని బీజేపీని విడిచిపెట్టమని కూడా ప్రకటనలు చేస్తుంటారు. అయితే మొత్తానికైతే టీడీపీ, జనసేన, బీజేపీల కలయికపై అయోమం, గందరగోళం నెలకొంది. విచిత్రమేమిటంటే.. ఈ మూడు పార్టీలు కలిసే పోటీచేస్తాయని అధికార వైసీపీ ఆరోపణ,అనుమానం. దీనిబట్టి చూస్తే ఆ మూడు పార్టీలు వ్యూహంలో భాగంగానే అయోమయం సృష్టిస్తున్నాయా? లేకుంటే ఆ మూడు కలవడం ఇష్టం లేకపోవడంతో అధికార పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందా? అన్నది తెలియరావడం లేదు.
అయితే పవన్ మాత్రం స్పష్టంగా ఉన్నారు. ప్రధాని మోదీని కలిసిన తరువాత స్పష్టంగా పనిచేసుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలను చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని.. కలిసివచ్చే పార్టీలతో కలిసి వెళతానని మాత్రమే చెబుతున్నారు. ఎక్కడా నేరుగా టీడీపీ ప్రస్తావన తేవడం లేదు. బీజేపీని నేరుగా మిత్రుడిగా అంగీకరిస్తూ ఎన్నికలతో ఆ పార్టీతో కలిసి వెళతానని అన్ని వేదికల వద్ద చెబుతున్నారు. బీజేపీ మాత్రం పవన్ వరకూ ఒకే కానీ టీడీపీ అయితే అస్సలు వద్దని తేల్చిచెబుతోంది. ఒక వేళ పవన్ టీడీపీతో వెళితే ఒంటరిగానైనా బరిలో దిగుతామని చెబుతోంది. అయితే ఇది రాష్ట్ర బీజేపీ నాయకుల నోటి నుంచి వస్తున్న మాటే తప్పించి.. కేంద్ర పెద్దల నుంచి రావడం లేదు. సో ఇక్కడ సస్పెన్ష్ ఇంకా కొనసాగుతుందన్న మాట.

2024 ఎన్నికలు తమ టార్గెట్ కాదని.. తామ ఫోకస్ అంతా 2029 ఎన్నికలేనంటూ బీజేపీ చెబుతోంది. ఇప్పుడు కానీ టీడీపీతో కలిస్తే చంద్రబాబుకు మరోసారి చాన్స్ ఇచ్చినట్టేనని వాదిస్తోంది. అది ఎంతమాత్రం టీడీపీకి లాభమే తప్ప జనసేనకు, బీజేపీకి కలిసి వచ్చే మార్గం కాదని రాష్ట్ర బీజేపీ నాయకులు వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గెలుపు ముఖం వాచిపోయామని.. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలం అయినందున.. వచ్చే ఎన్నికల్లో గెలవకుంటే పార్టీ శ్రేణుల్లో నమ్మకం సన్నగిల్లుతుందని.. పైగా వైసీపీ మరీ చులకనగా చూస్తుందన్నది పవన్ వాదన. ఎవరికి వారు విడివిడిగా పోటీచేస్తే వైసీపీ నెత్తిన పాలుపోసినట్టవుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే తనకు ఢిల్లీ పెద్దలతో పనికానీ.. రాష్ట్ర నాయకులతో పనిలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారినే అనుసరిస్తున్నారు.
మరోవైపు పవన్ మరో ఫార్ములాను అనుసరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల వరకూ బీజేపీని ఇలా డిఫెన్స్ లో ఉంచగలిగితే.. తమ రూట్లోకి ఆ పార్టీ రావడమో.. లేకుంటే బలపడంగా ఉండిపోవడమో జరుగుతుందని అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే ద్విముఖ వ్యూహంతో పవన్ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈలోపు సీట్లు వాటా తేల్చడం, పెండింగ్ సినిమాలు పూర్తిచేయడం, తరువాత వారాహి యాత్రకు సిద్ధమవ్వడం వంటి వాటిపై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. 2029 వరకూ వెయిట్ చేసే చాన్సే లేదని.. 2024 ఎన్నికల్లో జగన్ ను పడగొట్టడం.. నేరుగా పవర్ లోకి రావడం, లేకుంటే మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుచేయడమే పవన్ ముందున్న టాస్క్ లని జన సైనికులు చెబుతున్నారు.