సినిమా ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. సమస్యలు ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించడంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న విధానాలను దునుమాడారు. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ సంధించిన విమర్శనాస్త్రాలు.. ఇంకా అలజడి రేపుతూనే ఉన్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే.. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించారు జనసేనాని.
ఇప్పటికే.. ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు భారీగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయం సైతం సక్రమంగా నిర్వర్తించలేకపోతోందని, ఆ కారణంగానే కనీసం జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతినెలా వేతనాలకోసం ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక, అప్పులు కూడా కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్.. జగన్ పాలనపై ధ్వజమెత్తారు.
‘‘వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు.. వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు’’ అనే పోస్టు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ట్వీట్ కు ఒక పట్టికను జత చేశారు. ఇందులో.. ఒక వైపు ఏపీ ప్రభుత్వ వాగ్ధానాలు.. మరో వైపు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు పవన్. ఎన్నికల వేళ మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఆదాయాన్నే రుణాలకు భద్రతగా మార్చుకుందని విమర్శించారు పవన్.
అదేవిధంగా.. కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి, భారీగా పెంచేశారని పేర్కొన్నారు. సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని చెప్పిన సర్కారు.. బీసీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లకు నిధులు నిలిపేశారని తెలిపారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పిస్తామని చెప్పారని.. ఇప్పుడు మొత్తం నేరాల రేటు 63 శాతం పెరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయడం అటుంచితే.. దాదాపు 4 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని మండిపడ్డారు. ఆ పట్టికలో ఇంకా.. మరెన్నో వివరాలను పోల్చి చూపారు పవన్. ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు – వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021