భారత ప్రధాని నరేంద్రమోడీకి జిగ్రీ దోస్త్ డోనాల్డ్ ట్రంప్. ఆయన మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని ఏకంగా మోడీ అమెరికా వెళ్లి మరీ ‘హౌడీ మోడీ’ సభలో ప్రచారం చేశాడు. కానీ బ్యాడ్ లక్.. ట్రంప్ ఓడిపోయాడు. ఆయన ప్రత్యర్థి జోబిడెన్ గెలిచాడు. అమెరికా అధ్యక్షుడయ్యాడు. తన పగవాడికి ప్రాధాన్యమిచ్చి గెలుపునకు ప్రచారం చేసిన నరేంద్రమోడీ అమెరికాకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జోబిడెన్.. మోడీని సరిగ్గా మర్యాద ఇచ్చాడా? పట్టించుకున్నాడా? ప్రాధాన్యత కల్పించాడా? అన్నది చర్చనీయాంశమైంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాకు మోదీ వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ సుధీర్ఘ కాలం తరువాత మోదీ చేసిన మొదటి పర్యటన అమెరికాకు వెళ్లడమే. కరోనా మహమ్మారి కారణంగా పలు దేశాలతో సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించారు. ప్రస్తుతం క్వాడ్ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్లో కీలక సమావేశాలు జరిగాయి. 2019లో మోదీ అమెరికా వెళ్లారు. అప్పుడు ట్రంప్ సర్కార్ ఉంది. అయితే మోదీ అప్పటి పర్యటనకు, ఇప్పటి పర్యటనకు చాలా తేడా ఉందంటున్నారు. నాడు ‘హోడీ మోడీ’ అంటూ అమెరికాలో ట్రంప్ కు మద్దతుగా మోడీ చేసిన ఎన్నికల ప్రచారం వైరల్ అయ్యింది. ట్రంప్ సర్కార్ మోడీని నెత్తిన పెట్టుకుంది. కానీ తాజాగా చేసిన పర్యటనట్లో మోదీకి గౌరవాలు దక్కలేదా..? అనే చర్చ సాగుతోంది.
కరోనా పరిస్థితులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లారు. నాలుగు దేశాలు కలిసి వివిధ రంగాల్లో గ్రూపులను, కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. సభ్య దేశాల సహకారంతో సమస్యలు అధిగమించాలని చర్చించాయి. పలు విషయాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తొలిసారిగా ముఖాముఖిగా సమావేశం అయ్యారు.
2019లో మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ట్రంప్ పాలన సాగుతుండేది. అంతేకాకుండా ప్రవాస భారతీయులు సైతం పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేసి ‘హౌడీ మోదీ’ అని ఆ పర్యటనకు పేరు పెట్టారు. స్వయంగా ట్రంప్.. మోదీని సభకు తీసుకెళ్లారు. దీంతో మోదీ, ట్రంప్ ల మధ్య సాన్నిహిత్యం గురించి అందరూ చర్చించుకున్నారు. ఇక మోదీ ఆ సభలో మాట్లాడుతూ ‘ఔర్ ఏక్ బార్.. ట్రంప్ సర్కార్ ఆయేగా’ అంటూ ప్రసంగం చేశారు. దీంతో ట్రంప్ వర్గాలతో పాటు కొంతమంది ప్రవాసుల్లో సైతం మోదీ ప్రసంగం ఉత్తేజాన్ని నింపింది.
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 23న అమెరికా వెళ్లిన మోదీకి అమెరికా ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. అయితే మోదీ రాకను వ్యతిరేకించిన వాళ్లూ ఉన్నారు. కొందరు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల వ్యూహంతో వారి పని సాధ్యం కాలేదు. ట్రంప్ హయాంలో మోదీ పర్యటించినప్పుడు అధ్యక్షుడే వైట్ హౌజ్ వెలుపలికి వచ్చి మోదీని స్వాగతించారు. కానీ ఈసారి బైడెన్ అలా చేయలేదు. కానీ వైట్ హౌజ్ అధికారులు దగ్గరుండి మోదీనీ తీసుకెళ్లారు. అంతకుముందులా అమెరికా అధ్యక్షుడితో మోదీ ఆలింగనం చేసుకోలేదు. అయితే దీనికి కరోనా కారణం అని చెబుతున్నారు.
ఇక మోదీ ప్రసంగంపై పత్రికలు పట్టించుకోలేదని తెలుస్తోంది. 2019లో మోదీ, ట్రంప్ ల గురించి ప్రత్యక కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘భారత్ ట్రంప్ ’ అని కూడా పేర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. న్యూయార్క్ పత్రికల్లో మోదీ, బైడెన్ ల గురించి పెద్దగా వార్తలు రాయలేదు. ఇక కరోనా కారణంగా ఎలాంటి బహిరంగ సభలను ఏర్పాటు చేయలేదు. కేవలం వందల మంది భారతీయులను మాత్రమే మోదీ కలిశారు. మోదీకి స్వాగతం పలకడానికి ప్ల కార్డులు పట్టుకొని చాలా మంది వైట్ హౌజ్ వద్దకు వచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్, అమెరికా వ్యూహాలు ఒకేలా ఉన్నాయి. ఇరు దేశాల మద్య పరస్పర సహకారం కూడా అవసరం. అయితే ఈ సమావేశాల్లో కరోనా ప్రభావం బాగానే కనిపించింది. జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలు నిర్వహించారు. మోదీని బైడెన్ పెద్దగా పొగడకపోయినా.. బైడెన్ ను మోదీ మహానాయకుడు అని అన్నారు. అటు యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తో జరిగిన చర్చల్లో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. మొత్తంగా మోదీకి ఈసారి అమెరికాలో మునుపటి అంతగా ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది.