Pawan Kalyan- Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళితే మే, జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం మునుపటిలా నల్లేరు మీద నడక కాదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తొమ్మిదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మరోవైపు కేసీఆర్ రాష్ట్ర పాలనను పూర్తిగా గాలికి వదిలేసి జాతీయ రాజాకీయాలపై దృష్టిపెట్టారు. తెలంగాణ ప్రజల సొమ్మును తన పార్టీ విస్తరణకు వినియోగిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ వ్యూహాలకు విపక్షాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికలను గట్టెక్కడం కేసీఆర్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. అయితే రాజకీయ చతురుడైన కేసీఆర్ ఎన్నికల నాటికి ఏదో ఒక జిమ్మిక్కు చేస్తారన్న వాదన కూడా ఉంది.

పోటాపోటీగా విపక్షాలు..
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామంటూ బీజేపీ, కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా, ఇన్నాళ్లు అంతర్గత సమస్యలతో సతమతమైన కాంగ్రెస్ కూడా ఇప్పుడు సమరానికి సై అంటోంది. ఈ పరిస్థితి కేసీఆర్ ఊహించింది కాదు. గత ఎన్నికల్లాగే విపక్షాలు బలపడేనాటికి ఎన్నికలకు వెళ్లాలని భావించారు. కానీ గులాబీ బాస్ వ్యూహాన్ని పసిగట్టిన విపక్షాలు ఆయనకు ఆ చాన్స్ ఇవ్వకుండా చేస్తున్నాయి. ఐదేళ్లు పాలన సాగించే పరిస్థితి తీసుకొస్తున్నాయి.

రేవంత్ గెలుపునకు జనసేన సహకారం..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు విపక్షాలు ఏ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిచేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోను పోటీచేస్తానని మంగళగిరిలో ప్రకటించిన పవన్.. 30 నుంచి 35 సీట్లలో అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అనుకూల ఓటును చీల్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు జనసేన, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీచేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనాని సహకారం కోరనున్నట్లు పొలిటికల్ టాక్. ఆమేరకు టీడీపీ జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి పరోక్షంగా రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ విజయానికి సహకరించాలని బాబు ప్రాన్ చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన పొత్తు పరోక్షంగా కాంగ్రెస్‌కు లాభించేలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.