Lokesh Padayatra- YCP: సంక్షేమ పథకాల పై వైసీపీ గంపెడాశలు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. అదే సమయంలో లోకేష్ పాదయాత్రను చూసి భయపడుతోంది. అనుమతి ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీలో పాదయాత్రలు కొత్త కాదు. గతంలో జగన్ చేశారు. ఇప్పుడు లోకేష్ చేయబోతున్నారు. అంతే తేడా. ఇప్పుడు చర్చంతా పాదయాత్రకు అనుమతి గురించే. సంక్షేమ రాజ్యమని చెప్పుకునే వైసీపీకి భయమెందుకు ? అనుమతి ఇవ్వచ్చు కదా ? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

జనవరి 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. కానీ ఇంత వరకు పాదయాత్రకు అనుమతి లేదు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటంలేదు. ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ వరకు టీడీపీ అనుమతి కోరుతూ లేఖలు రాసినా సరైన స్పందన లేదు. విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ అనుమతిని తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతోనే పోలీసులు అధికారులు ఇలా స్పందిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం పాదయాత్రకు అనుమతిచ్చేందుకు జంకుతోంది.
“ జగన్ పాదయాత్ర చేశారు. అడిగిన వెంటనే అనుమతి ఇచ్చాం. మేం అనుమతి ఇవ్వకపోతే జగన్ పాదయాత్ర చేసేవారా ? షర్మిల ప్రజల్లో తిరిగేవారా ? “ అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ రాజ్యమని చెప్పుకునే వైసీపీకి తమ పాలన పట్ల నమ్మకం లేదని, అందుకే లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు భయపడుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారని చెబుతున్నారు.
నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అనుమతి ఇవ్వాలా ? వద్దా ?. ఇస్తే… ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు టీడీపీ వైపు మళ్లే అవకాశం ఉందా ? అని వైసీపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయినా వైసీపీకి నష్టం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలు అంశాల పై స్పష్ట వచ్చాక లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయం పై ప్రభుత్వం క్లారిటీకి రానుంది.

లోకేష్ పాదయాత్రకు అనుమతిని తాత్సారం చేయడాన్ని అనుకూలంగా మార్చుకునే పనిలోపడింది టీడీపీ. వైసీపీ పై విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతోంది. లోకేష్ ను చూసి జగన్ భయపడుతున్నాడు కాబట్టే పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వైసీపీ మాత్రం చివరి నిమిషంలో అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ నేతల్ని టెన్షన్ పెడుతూ మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.