Pawan Kalyan: తెలంగాణ కంటే ఏపీలోనే ఎన్నికల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. కేవలం 10 మాసాల వ్యవధే ఉంది కానీ పెద్దగా హడావుడి లేదు. కానీ ఏపీలో ఎన్నికల కాక ఎప్పటి నుంచో మొదలైంది. తాజాగా ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అని ప్రకటించారు. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముందస్తు ఎన్నికలు తప్పవని సంకేతాలిచ్చారు. అంటే అధికార పార్టీ అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విపక్షాలు మాత్రం ఇప్పటివరకూ ఎవరికి వారుగా ఉంటున్నారు. పార్టీల బలోపేతంపై ఫోకస్ పెట్టారు. టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయని వార్తలు వచ్చాయి. అటు తరువాత ఆ రెండు పార్టీలు బీజేపీని కలుపుకొని వెళతాయని కామెంట్స్ వినిపించాయి. అయితే వీటిపై ఎటువంటి స్పష్టత లేదు. అధికార వైసీపీ మాత్రం కలిసి వచ్చినా సరే.. విడివిడిగా వచ్చినా సరే మేము సిద్ధమంటూ సవాల్ చేస్తోంది.

ఏపీలో పొత్తులపై కన్ఫ్యూజన్ వీడడం లేదు. గత ఎన్నికల తరువాత బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా మారాయి. వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. కానీ కలిసిన సందర్భాలు చాలా తక్కువ. అటు తరువాత టీడీపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు, పవన్ మాటలు కలిశాయి. పరామర్శలు సైతం సాగాయి. ఇరు పార్టీల శ్రేణులు సైతం మానసికంగా సిద్ధమయ్యాయి. అయితే ప్రధాని మోదీని కలిసిన తరువాత పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. పవన్ స్వరంలో మార్పులు వచ్చాయని కామెంట్స్ వినిపించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని పవన్ హెచ్చరికలు టీడీపీకి దగ్గర చేశాయి. అదే సమయంలో అవసరమైతే బీజేపీని ఒప్పించి మరీ కూటమిలోకి తెస్తానని పవన్ అన్నట్టు వార్తలు వచ్చాయి. తనను విజయవాడలో చంద్రబాబు కలిసే సమయంలో కూడా కలిసి పనిచేస్తామని పవన్ ప్రకటించారు. కానీ విశాఖలో ప్రధానిని కలిసి తరువాత పవన్ స్టేట్ మెంట్లలో మార్పులు కనిపించాయి.
ప్రధానితో పవన్ ఏం చర్చించారో తెలియదు కానీ.. ఎవరికి వారు విశ్లేషణలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే పవన్ ప్రకటనలో మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను బరిలో దించుతామని పవన్ ప్రకటించడంతో టీడీపీ తో పొత్తు ఉండదని దాదాపు అంతా నిర్థారణకు వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో నాదేండ్ల మనోహర్ ఎంటరయ్యారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ పార్టీ లక్ష్యమని.. దానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం ద్వారా.. పొత్తులను సజీవంగా ఉంచారు. అన్ని పార్టీలను కలుపుకొని వెళతామంటూ మరో కన్ఫ్యూజన్ కు తెరతీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని వ్యూహంతో ముందుకెళతామన్నారు. ఆ వ్యూహం ఏమిటన్నది జనసేన శ్రేణులకు అంతుపట్టడం లేదు. అదే కన్ఫ్యూజన్ ను కొనసాగింపులా ఇప్పటం బాధితుల సమావేశంలో పవన్ వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానని హెచ్చరించారు. దీంతో అవి జనసేన శ్రేణుల్లో అయోమయానికి గురిచేశాయి.

దాదాపు పార్టీ నిర్ణయలేమిటి? పొత్తుపై ఎలా ముందుకెళుతున్నారని పార్టీ శ్రేణులు ఆరాతీయడం మొదలు పెట్టాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్ వరకూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని.. అటు తరువాతే పొత్తుల కోసం ఆలోచిద్దామని చెప్పడంతో పార్టీ శ్రేణులు కాస్తా కుదుటపడ్డాయి. బీజేపీతో మాట్లాడిన తరువాత పొత్తులపై ప్రకటన చేద్దామని అధినేత అనేసరికి పార్టీ సీనియర్లు ఊపిరి పీల్చుకున్నారు.