Pawan Kalyan- Uttarandhra Ministers: ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టు సడలుతోందా? మంత్రులు సైతం ఎదురీదుతున్నారా? రోజురోజుకూ ఓటమి అంచులోకి వెళుతున్నారా? వారికి భవిష్యత్ బెంగ పట్టుకుందా? ముఖ్యంగా జనసేన రూపంలో తమ ఆధిపత్యానికి గండిపడుతోందని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పవన్ ప్రకటించిన తరువాత వారిలో భయం పెరిగింది. అటు చంద్రబాబుతో పవన్ భేటీ తరువాత వారు ముచ్చెమటలు పడుతున్నారు. పవన్ అన్నంత పనిచేస్తున్నారని..తమకు ఈసారి ప్రతికూల పరిస్థితులు తప్పవని అంతర్గత సమావేశాల్లో సైతం చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో 33 నియోజకవర్గాల్లోనూ గడ్డు పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు ఈసారి గట్టి సవాళ్లనే ఎదుర్కొంటారని జోష్యం చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన నిరాశతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాలని ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు మద్దతు పలకకపోవడంతో అసహనం చెందుతున్నారు. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో ఆయన శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు. .జిల్లాలో అందరి కంటే ఆయన మెజార్టీయే తక్కువ. అంతటి ప్రభంజనంలో కూడా మూడు, నాలుగు వేల ఓట్లతో బయటపడ్డారు. అందుకే కాబోలు జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో తొలి మూడేళ్లు పార్టీకి ధర్మాన అంటీముట్టనట్టుగా ఉండేవారు, నెల్లూరిలోని ఆనం రామనారాయణరెడ్డి తరహాలో రాజకీయాలు చేసేవారు. అయితే జిల్లా వ్యాప్తంగా కేడర్, ఆపై చివరి రెండేళ్లు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తారని విస్తరణలో ప్రసాదరావుకు అవకాశమిచ్చారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను చూసి ధర్మాన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే తనకు బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు అధినేత ససేమిరా అనడంతో భయంతోనే తన పని తాను చేసుకుంటున్నారు.
మంత్రి సీదిరి అప్పలరాజుది అదే పరిస్థితి. బయటకు అంతా బాగానే కనిపిస్తున్నా.. తెర వెనుక మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. సొంత పార్టీ నుంచే ఆయన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థులపై చూపించే దూకుడు స్వభావం అభివృద్ధిపై చూపించడం లేదన్న అపవాదు ఉంది.పైగా స్వల్పకాలంలోనే అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పలాస నియోజకవర్గంలో తన అనుచరులతో భూదందాలు జరిపిస్తున్నారన్న ప్రచారం ఉంది. మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో ఆయన అవినీతి మరింత వెలుగులోకి వచ్చింది. సొంత పార్టీలో అసమ్మతి, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైగా మత్స్యార వర్గాల్లో జనసేన ప్రభావం అధికం. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి ఏర్పడితే మాత్రం సీదిరికి భారీ దెబ్బ. ఎందుకంటే గత ఎన్నికల్లో తన సొంత సామాజికవర్గమైన మత్స్యకారుల నుంచి సపోర్టు లభించింది. ఈసారి అంతలా కుదిరే పని కాదు.

అటు విజయనగరానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఏ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి, ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హవా జిల్లాలో నడుస్తున్నట్టు ప్రచారం ఉంది. హైకమాండ్ చర్యలతో బొత్స కూడా ఓకింత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ యువ నాయకుడు కిమిడి నాగార్జున యాక్టివ్ గా ఉండడం, బొత్స స్థానికంగా ఉండకపోవడం, సొంత కుటుంబంలో విభేదాలు తలెత్తడం, చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన కూడా యాక్టివ్ అవుతుండడంతో బొత్స గెలుపు ఈసారి అంత ఈజీ కాదు.
విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి దారుణంగా తయారైంది. మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన దూకుడును కనబరుస్తున్నారు. ఇప్పుడదే ఆయనకు మైనస్ గా మారింది. ప్రత్యర్థులకు అమర్నాథ్ టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్ విషయంలో అమర్నాథ్ వ్యవహార శైలిని కాపులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో సపోర్టు చేసిన మెజార్టీ వర్గం మంత్రికి దూరమైంది. అటు జనసేన కూడా అనకాపల్లి నియోజకవర్గంలో గ్రాఫ్ పెంచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ ఎదురీదక తప్పని పరిస్థితి. విశాఖకు చెందిన మంత్రి ముత్యాలనాయుడు, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రాజన్నదొరల పరిస్థితి కాస్తా మెరుగు. వీరు తమ సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతున్నారు. దీంతో మిగతా మంత్రులతో పోల్చుకుంటే పర్వాలేదు. అయినా ప్రభుత్వ వ్యతిరేకత, జనసేన ప్రభావముంటుందని భయపడుతున్నారు.