AP BRS: ఏపీలో క్విడ్ ప్రో కో రాజకీయం మొదలైంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ముసుగు క్రమంగా తొలుగుతోంది. ఏపీ బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టడం వెనుక మర్మం బయటపడుతోంది. దీని వెనుక స్వప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు లేవన్న సంగతి తేటతెల్లమవుతోంది. ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో అన్న కొటేషన్ తోట చంద్రశేఖర్ వైఖరికి అద్దం పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. తోట పార్టీ మార్పు వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

తోట చంద్రశేఖర్.. జనసేనలో కీలక నేత. మాజీ ఐఏఎస్ అధికారి. తెలుగులో ఓ టీవీ చానెల్ నడుతున్న మీడియా యజమాని. ఉన్నట్టుండి బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ విధివిధానాల్ని ఆహా.. ఓహో అంటూ ఆకాశానికెత్తేశారు. జనసేనకు విధివిధానాలు లేవంటూ విమర్శించారు. మరి అప్పటి వరకు విధివిధానాలు లేని పార్టీలో కీలక నేతగా ఎలా కొనసాగారో ఆయనకే తెలియాలి.
తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎంట్రీ వెనుక చాలా రాజకీయం ఉందని తెలుస్తోంది. ఏపీలో కాపు ఓట్ల చీలికే ప్రధాన లక్ష్యంగా.. జగన్ కు మేలు చేయడమే బాధ్యతగా ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారని వినికిడి. కేసీఆర్ బీఆర్ఎస్ ఎంట్రీతో కాపు ఓట్లు జనసేనకు గంపగుత్తగా వెళ్లకుండా చీల్చాలని, తద్వార జగన్ కు మేలు చేయాలని ఎత్తుగడ వేసినట్టు విశ్లేషకుల అంచనా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని పవన్ ప్రకటన నేపథ్యంలో.. తోట చంద్రశేఖర్ ద్వార కాపు ఓట్లు చీల్చాలని కేసీఆర్, జగన్ కలిసి ఆడుతున్న జగన్నాటకంలో తోట చంద్రశేఖర్ పాత్రధారిగా మారారని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్వప్రయోజనం లేకుండా తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పగ్గాలు పట్టలేదని మరో వాదన. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు చేపట్టినందుకు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లో లబ్ధి పొందనున్నారని తెలంగాణలో పలువురి అభిప్రాయం. తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ వజ్రంతో పోల్చారు. మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన చంద్రశేఖర్.. కేసీఆర్ కు వజ్రంలా ఎలా కనపడ్డారో అన్న సందేహం వెలిబుచ్చుతన్నారు. అటు కేసీఆర్.. ఇటు తోట చంద్రేశేఖర్ ఇరువురూ ఉమ్మడి ప్రయోజనాల కోసమే జగన్నాటకంలో సూత్రధారి, పాత్రధారులయ్యారన్న వాదన వినిపిస్తోంది.