Pawan Kalyan- Modi And Amit Shah: నన్ను టచ్ చేసినా.. నా జోలికి వచ్చినా ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తానని చెప్పిన పవన్ అన్నంత పని చేశారు. ఇన్నాళ్లూ తనలో మంచితనాన్నే చూశారని..యుద్ధం ప్రకటిస్తున్నాను కాచుకోండి అంటూ సవాల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించారు. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ అండదండలు చూసుకొని రెచ్చిపోయిన ఏపీ సీఎం జగన్ కూడా గట్టి సంకేతాలే పంపించారు. ఇటు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును తన దగ్గరకు రప్పించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవసరమైతే వ్యూహం మార్చుకుంటానని కూడా అటు కేంద్ర పెద్దలకు హెచ్చరికలు పంపారు. మరోవైపు మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాక్షేత్రంలో వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఆగ్రహంతో ఆందోళనకు గురైన కేంద్ర పెద్దలు ఏపీపై ఫోకస్ పెంచారు. అందులో భాగంగానే ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. త్వరలో అమిత్ షా కూడా పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బ కొట్టే క్రమంలో బీజేపీ కూడా రాష్ట్రంలో చావుదెబ్బ తినింది. అటు చంద్రబాబు కూడా భారీగా దెబ్బతిన్నారు. ఈ క్రమంలో జనసేనతో బీజేపీ జతకట్టింది. కానీ చంద్రబాబును దృష్టిలో పెట్టుకొని కేంద్ర పెద్దలు జగన్ సర్కారుకు సాయమందిస్తూ వచ్చారు. అటు వైసీపీకి ఉన్న ఎంపీల సంఖ్యాబలంతో బీజేపీ కూడా జగన్ సాయం తీసుకుంది. జరిగిన పొరపాటును గ్రహించి చంద్రబాబు దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా బీజేపీ దూరం పెడుతూ వచ్చింది. వైసీపీ విషయంలో మాత్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటానికి రూట్ మ్యాప్ ఇస్తానని చెప్పిన బీజేపీ పెద్దలు తాత్సారం చేస్తూ వచ్చారు. దీంతో విసిగి వేశారిపోయిన పవన్ వైసీపీ దురాగతాలపై యుద్ధానికి సిద్ధమయ్యారు. అటు కేంద్ర పెద్దల వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. దీంతో పవన్ రూపంలో ఎదురవుతున్న ప్రతిఘటనను చూసి బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు వదులుకోబోమని సంకేతాలిచ్చారు. అందుకే ఏపీపై ఫోకస్ పెంచారు.అటు రాజకీయ పొత్తులు, పవన్ తో స్నేహం, వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తదితర అంశాలపై స్పష్టతనివ్వనున్నారు.

నవంబరు 11న విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్నారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆదునీకరణ పనులను ప్రారంభించనున్నారు. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటనను రాజకీయంగా వినియోగించుకోవాలని వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధానితో శంకుస్థాపన చేయ్యాలని భావిస్తోంది. అయితే ఇప్పటివరకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టు సమాచారం. కేంద్ర పెద్దలు జనసేన అధ్యక్షుడు పవన్ కు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ సర్కారు నిర్ణయాన్ని పక్కనపడేసినట్టు సమాచారం. ప్రధాని నేరుగా పవన్ తో చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమైనట్టే.