TRS Plan Messed Up: జాతీయ రాజకీల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దసరా రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో టీఆర్‌ఎస్ అధినేత మునుగోడు గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించారు. ఈమేరకు తన బలగం మొత్తాన్ని మునుగోడులో మోహరించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈమేరకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు గులాబీ బాస్. ఈ క్రమంలో డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరే సర్పంచ్‌కు రూ.5 లక్షలు, ఎంపీటీసీకి రూ.10 లక్షలు, ఎంపీపీకి రూ.20 లక్షలు చొప్పున చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్య నేతలకు అయితే రూ.50 లక్షల వరకు చెల్లించినట్లు తెలిసింది.

ఎన్ని చేసినా మునుగోడులో పెరగని గ్రాఫ్..
ఫాంహౌస్ నుంచే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్ ఎన్ని చేసినా టీఆర్‌ఎస్ గ్రాఫ్ పెరుగకపోవడంతో అసహనానికి లోనవుతున్నారు. పార్టీ అంతర్గత సర్వేతోపాటు, ఇంటలిజెన్స్ ద్వారా టీఆర్‌ఎస్ విజయావకాశాలపై ఏరోజుకారోజు నివేదిక తెప్పించుకుంటున్నారు. కుల సంఘాలను టీఆర్‌ఎస్ వైపు తిప్పు కునేందుకు పద్మశాలీ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు తాయిలాలు ప్రకటించారు. మునుగోడులోని ఆయా సామాజిక వర్గాల ఓటర్లను వాహనాల్లో ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రప్పించి కేటీఆర్‌తో మాట్లాడిస్తున్నారు. సమావేశం అనంతరం మద్యం పంచడంతోపాటు మటన్, చికెన్ బిర్యానీతో భోజనం పెట్టి పంపిస్తున్నారు. సమావేశంలో తామంటా టీఆర్‌ఎస్ వెంట ఉంటామంటున్న ఓటర్లు మునుగోడులో అడుగు పెట్టగానే మారిపోతున్నారు.
నిద్రలేని రాత్రులు గడుపుతున్న కేసీఆర్..
జాతీయ రాజకీయాలకు మునుగోడు గెలుపుతో శ్రీకారం చుట్టాలని భావిస్తున్న కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో గులాబీ బాస్ కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సీబీఐ పదును పను పెట్టడంతో త్వరలోనే ప్రగతిభవన్ తలుపు తడుతుందన్న సమాచారం కేసీఆర్‌ను టెన్షన్ పెడుతోంది. మరోవైపు మునుగోడులో ఓడితే దాని ప్రభావం బీఆర్‌ఎస్‌పైనా ఉంటుందని కేసీఆర్ మదన పడుతన్నారు. బీజేపీ ఎదురుదాడి చేస్తుందని ఆందోళన చెందుతున్నారు.
లాబీయింగ్ విఫలం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సన్నిహితుడు అభిషేక్‌రావును సీబీఐ అరెస్ట్ చేయడంతో తర్వాత కవితనే అని ఢిల్లీ వర్గాలు ప్రచారం చేశాయి. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. బీజేపీతో లాబీయింగ్ జరిపేందుకు ములాయన్‌సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూతురును వెంటపెట్టుకుని ఉత్తర ప్రదేశ్ వెళ్లిన కేసీఆర్ అటునుంచి అటే Éì ల్లీ వెళ్లారు. సీబీఐ ప్రగతిభవన్ తలుపు తట్టకుండా ఉండేందకు కేంద్ర హోం మంత్రితో లాబీయింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈమేరకు అమిషా సన్నిహితులతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్‌ను కలిసేందుకు అమిత్‌షా నిరాకరించినట్లు తెలిసింది. దీంతో నిరాశగా హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదును పెట్టారు.
ఎమ్మెల్యేలకు రూ.400 కోట్ల బేరానికి వ్యూహం…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఎలాంటి ఊరట లభించలేదు. మరోవైపు ఉన్న ఒక్కదారి మూసుకుపోయింది. దీంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయ కుట్రకు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంటున్న నేపథ్యంలో అదే వ్యూహంతో బీజేపీని కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట పథకం రరించారని తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెలేకు రూ.100 కోట్ల చొప్పున డీల్ అన్నట్లుగా ఫాంహౌస్ బేరానికి తెరలేపారని ప్రచారం జరగుతోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు పైలట్ రోహితరెడ్డి గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్‌రెడ్డిని ఇందులో పావులుగా మార్చారని సమాచారం.
రోహిత్‌రెడ్డి సన్నిహితుడితోనే బేరం..
పైలట్ రోహిత్‌రెడ్డికి మోయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. అక్కడే బేరసారాలు నడిపించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈమేకు రోహిత్‌రెడ్డి సన్నిహితుడైన వ్యాపారవేత్త నందకుమార్‌తో వ్యవహారం నడిపించేలా పథకం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు నందుతోపాటు, మరో ఇద్దరు స్వామీజీలకు ఫాంహౌస్‌కు రప్పించినట్లు తెలుస్తోంది. ఇక్కడే బేరసారాలు జరుగుతున్నట్లు పోలీసులతో వీడియోలు తీయించి, పోలీసులకు అక్కడకు రప్పించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

కుట్రను బయటపెట్టిన బీజేపీ..
కేసీఆర్ స్కెచ్ అర్థంకాని టీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంపై నోరు మెదపడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు కేవలం రాస్తారోకోలు చేస్తూ మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కుట్రను బీజేపీ నేతలు బట్టబయలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. సుదీర్ఘ ప్రెస్‌మీట్ ద్వారా కేసీఆర్ తీరును ఎండగట్టారు. టీఆర్‌ఎస్ గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరు. ప్రగతిభవన్‌లో జరిగిన తాజా స్కెచ్‌ను మీడియా ముఖంగా ఆవిష్కరించారు.
ప్రమాణానికి బండి సవాల్..
ఇక బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ కుట్ర ఎవరు చేశారో చెప్పడానికి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రమాణానికి తాను సిద్ధమని, ఇందుకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను యాదాద్రికి వస్తానని కేసీఆర్ తప్పు చేయకుంటే యాదాద్రికి రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రఘునందర్‌రావు తదితరులు కూడా కేసీఆర్ కుట్రను మీడియా ముఖంగానే ఎండగట్టారు. దీంతో కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులపై అనుమానాలు..
– కేసీఆర్ ఎప్పుడు ప్లాన్ వేసినా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిధిలోనే జరిగేల ఆచూస్తున్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం అంటూ ఓ కథ నడిపించారు. స్టీఫెన్ రవీంద్ర మాట్లాడిన తీరుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత దీనిపై ఎవరూ నోరు మెదుపలేదు.
– తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ స్టీఫెన్ రవీంద్రనే డీల్‌చేశారు. ఆయనే దగ్గరుండి దాడిచేసినట్లుగా చూపించారు. అయితే ఇక్కడ కూడా సీపీ పొడిపొడిగా, అయిష్టంగా వివరాలు వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– ఇక బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ఫోన్‌కాల్ లిస్ట్, నలుగురు ఎమ్మెల్యేల కాల్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు కానీ, టీఆర్‌ఎస్ నేతలు కానీ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
– ఇక ప్రమాణానికి కేసీఆర్ వెనుకడుగు వేయడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సాయంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మరి ఈ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది.