Pawan Kalyan: ఎన్నికల అన్నాక ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి గెలుపొందాలన్న వ్యూహంతో జగన్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకతాటి పైకి తీసుకురావాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. విపక్షాలను దాదాపు ఏకం చేసినంత పని చేశారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు చేయించడం విశేషం. ముఖ్యంగా కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు మొగ్గు చూపకుండా చూసే బాధ్యతను పవన్ కు అప్పగించారు చంద్రబాబు. మరోవైపు కూటమిలోకి బిజెపిని తెచ్చే బాధ్యతను పవన్ భుజస్కందాలపై పెట్టారు. ఇప్పుడు ఆ పనిలో నిమగ్నమయ్యారు పవన్. అయితే ఇందులో ఆయన కొంత సఫలీకృతులయ్యారు.
ముద్రగడ పద్మనాభం దాదాపు వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది. గత ఐదేళ్లలో జగన్ కు అనుకూలమైన ప్రకటనలు చేయడంతో సామాన్యులు సైతం ఇదే భావనతో ఉన్నారు. కానీ అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం యూ టర్న్ తీసుకున్నారు. నేరుగా జనసేన కీలక నేతలు వచ్చి రెండు గంటల పాటు చర్చించడంతో ఆయన మనసు మారిందని బయటకు వెల్లడయ్యింది. కానీ తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ముద్రగడ ఏంటి? జనసేనతో చర్చలు జరపడం ఏంటి? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. కానీ వైసీపీలో ఆశించిన స్థాయిలో ముద్రగడకు గౌరవం దక్కలేదని.. అక్కడ భంగపడ్డారని తెలుసుకున్న చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. పవన్ చే ప్రత్యేక ప్రకటన ఇప్పించారు. కాపు పెద్దల తిట్లను దీవెనలుగా మార్చుకుంటానని.. వారు వస్తానంటే ద్వారాలు తెరిచే ఉంచుతానని పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనతోనే ముద్రగడ వైసీపీలోకి వెళ్లకుండా వెనక్కి తగ్గారు. జనసేన నేతలు వస్తానంటే ఆహ్వానించారు. వారితో చర్చలు జరిపారు. అదే సమయంలో టిడిపి నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు ప్రయోగించారు. ఈ చర్చల సారాంశమే.. త్వరలో ముద్రగడతో పవన్ భేటీ.
మరోవైపు బిజెపిని కూటమిలోకి తెచ్చే బాధ్యతలను కూడా చంద్రబాబు పవన్ పై పెట్టారు. ఇప్పటికే బిజెపిలోని ప్రో టిడిపి నాయకులు తమ పని తాము చేస్తున్నారు. మరోవైపు పురందేశ్వరి సైతం తన పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ బిజెపి కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. వీలైనంతవరకు బిజెపి కూటమిలోకి త్వరగా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు, మూడు పార్టీల మధ్య సమన్వయం విషయంలో సైతం పవన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెర వెనుక ఉండి చంద్రబాబు ఆడిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం జనసేనలో చేర్చగలిగితే కాపుల ఓట్లు గుంప గుత్తిగా కూటమికి పడతాయన్నది చంద్రబాబు ఆలోచన. కాపుల్లో చీలిక తెచ్చి ముద్రగడ ద్వారా కొంత నష్టాన్ని అధిగమించవచ్చని జగన్ భావించారు. కానీ ఆ క్రెడిట్ ముద్రగడకు ఇచ్చేందుకు జగన్ వెనుకడుగు వేశారు. ముద్రగడ కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో చికాకు తెచ్చి పెట్టారు. అదే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పవన్ ను ప్రయోగించారు. ఒకవైపు ముద్రగడను, మరోవైపు బిజెపిని పవన్ ఆకర్షించగలిగితే ఏపీలో కూటమికి ఏకపక్ష విజయం దక్కే అవకాశం ఉంది. అయితే పవన్ ప్రయత్నాలు ఎంతవరకు కొలిక్కి వస్తాయో చూడాలి.