Pawan Kalyan Vizag Tour: జనసేనాని పవన్ మరోసారి విశాఖ పర్యటనకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. మొన్న విశాఖలో జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన పవన్ ను అధికార వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగిలింది. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసేన శ్రేణుల దాడి అంటూ నానా యాగి చేసింది. జనసేన నాయకులు తొమ్మిది మందిపై కేసులు నమోదుచేసి రిమాండ్ కు పంపింది. దీంతో పోలీసులిచ్చిన నోటీసులతో పవన్ రెండు రోజుల పాటు హోటల్ గదికే పరిమితమయ్యారు. జనసేన నాయకులు లేకుండా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేది లేదంటూ కార్యక్రమాన్ని ఏకంగా వాయిదా వేశారు. విజయవాడ చేరుకున్న పవన్ వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఏపీ పాలిటిక్స్ నే షేక్ చేశారు. ఈ రాజకీయ వేడి ఉండగానే ఆయన విశాఖ టూర్ కు ప్లాన్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం పోలీసు కేసులు ఎదుర్కొని రిమాండ్ లో గడిపిన జనసేన నాయకులంతా బెయిల్ పై ఇళ్లకు చేరుకున్నారు. కొందరి నాయకులపై పోలీసులు రాంగ్ ట్రీట్ మెంట్ కు దిగారని కూడా పవన్ కు ఫిర్యాదులు వచ్చాయి. కానీ పోలీసుల నోటీసులుండడంతో పవన్ వారికి పరామర్శించకుండానే విశాఖను విడిచిపెట్టాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికే పవన్ బాధనువ్యక్తం చేశారు. అంతకు ముందుగానే వైసీపీ ఆగడాలను గుర్తించిన పవన్ జనసేన శ్రేణులను అలెర్ట్ చేశారు. మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని కూడా అన్నారు. పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేశారంటూ నేతలపై కేసు నమోదుచేశారు. చివరకు జనసేన వీర మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వీరందర్నీ బెయిల్ పై బయటకు తెచ్చే బాధ్యతను జనసేన లీగల్ సెల్ విభాగం తీసుకుంది. దాదాపు అరెస్టయిన వారంతా బయటకు వచ్చారు. అప్పట్లో పోలీసుల ఆదేశాలతో వీరిని పవన్ పరామర్శించలేకపోయారు. అందుకే మరోసారి వీరి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా వాయిదా పడిన జనవాణి కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నారు. అయితే పవన్ విశాఖ టూర్ షెడ్యూల్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే మొన్నటి పవన్ విశాఖ పర్యటనతో వైసీపీ శ్రేణులు మూడు రాజధానుల డ్రామా, రాజీనామా అస్త్రాలు పటాపంచలయ్యాయి. ఈసారి పవన్ పర్యటన హైఓల్టేజ్ హీట్ పెంచే అవకాశమైతే కనిపిస్తోంది.