Shiv Nadar: ప్రపంచంలోని కుభేరుల లిస్టులో మనవాళ్లూ ఉన్నారు. బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ అత్యున్నతస్థానానికి ఎదిగారు. కానీ తమ సంపాదనలో దాతృత్వం చేసేవారు కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో శివ్ నాడర్ ఇప్పుడు ముందున్నారు. హెచ్ సీఎల్ కంపెనీ అధినేత అయిన శివ్ నాడార్ సమాజం కోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నట్లు ఇటీవల విడుదలయిన జాబితాలో తేలింది. ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2022 ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో శివ్ నాడార్ మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఆ లెక్క ప్రకారం ఆయన రోజుకు రూ.3 కోట్లు దాతృత్వం చేస్తున్నాడు.

ప్రతీ సంవత్సరం ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వం జాబితాను విడుదల చేస్తుంది. 2022 జాబితా ప్రకారం హెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఏడాదిలో రూ.1161 కోట్లు సమాజానికి ఇచ్చేశాడని ఎడెల్ గివ్ హురున్ పేర్కొంది. అంటే రోజుకు రూ.3 కోట్ల చొప్పున దానం చేశాడన్నమాట. దీంతో తమకు వచ్చిన సొమ్మును దానం చేయడంలో శివనాడార్ మొదటిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. ఆయన రూ.484 కోట్లు దానం చేశాడు. గతంలో వరుసగా రెండేళ్లు ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఈసారి మూడోస్థానంలో ముఖేశ్ అంబానీ రూ.411 కోట్లు, బిర్లా కుటుంబం రూ.242 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఎడెల్ గివ్ హురున్ తెలిపింది.
సంవత్సర కాలంలో రూ.100 కోట్లకు పైగా దాతృత్వం చేసిన వారిలో దేశ వ్యాప్తంగా 15 మంది ఉన్నారు. రూ.50 కోట్లు ఇచ్చినవారు 20, రూ.50 కోట్లకు పైగా దానం చేసిన వారు 43 మంది ఉన్నారు. జెరోదాకు చెందిన కామత్, నిఖిల్ కామత్ తమ విరాళాలను 300 శాతం పెంచి రూ. 100 కోట్ల జాబితాలో చేరారు. మైండ్ ట్రీ సహా వ్యవస్థాపకుడు సుబ్రోతో బాగ్చి, ఎస్.ఎస్. పార్థసారధి రూ.213 కోట్లు సాయం కోసం వెచ్చించారు.

టాప్ ప్లేసులో ఉన్న హెచ్ సీఎల్ అధినేత శివనాడార్ వ్యక్తిగత ఆస్తుల విలువ 2015 సంవత్సరం నాటికి 13.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం 28.9 మిలియన్ డాలర్లు. 1967లో పూణెలోని వాల్ చంద్ గ్రూప్ కంపెనీలో ఆయన జీవితం ప్రారంభమైంది. ఆ తరువాత మైక్రోకాంప్ అనే కంపెనీని స్థాపించాడు. దీని ద్వారా మొదటిసారిగా డిజిటల్ క్యాలిక్ లేటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత హెచ్ సీఎల్ ను రూ.1,87,000 పెట్టుబడితో ప్రారంభించాడు.