Pawan Kalyan- BJP: ఏపీలో పవన్ సరికొత్త రాజకీయ సమీకరణలకు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. నాతో పెట్టుకుంటే రాజకీయాలనే షేక్ చేస్తానని అధికార పార్టీ నేతలకు పవన్ గట్టి కౌంటరే ఇచ్చారు. అయితే ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశారు. పవన్ చెంతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు క్యూకట్టారు. అటు పలువురు రాష్ట్ర నాయకులు, జాతీయ పార్టీల అధ్యక్షులు కూడా ఫోన్ లో సంఘీభావం తెలిపారు. అటు వైసీపీ నేతల అరాచకాలపై గట్టిగానే మాట్లాడిన పవన్ కు మిత్రపక్షమైన బీజేపీ వ్యవహార శైలి నచ్చడం లేదన్న అసంతృప్తిని మాత్రం వెలిబుచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై జనసేన, బీజేపీ సంయుక్త పోరాటానికి బీజేపీ కేంద్ర పెద్దలు రూట్ మ్యాప్ ఇస్తారని పవన్ ఏనాడో ప్రకటించారు. కానీ ఇంతవరకూ అందించలేదు.రూట్ మ్యాప్ లో జాప్యంపై తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. బీజేపీ తమకు మిత్రపక్షమైన ఏపీ ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో కలిసి పోరాటం చేయలేకపోతున్నామని తన ఆవేదన కూల్ గా చెప్పారు. ఇప్పటికీ మిత్రపక్షంగా బీజేపీని అభిమానిస్తున్నామని చెబుతూనే ఏదేం బానిసత్వం కాదు కదా అంటూ చురకలు అంటించారు. బీజేపీతో ఏమంత కంఫర్టుగా లేమని సంకేతాలిచ్చారు.

వాస్తవానికి గత ఎన్నికల తరువాత జనసేన, బీజేపీ మధ్య స్నేహం కుదిరింది. వైసీపీ ప్రభుత్వంపై కలిసి పోరాడుతామని ఉభయ పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. అటు తరువాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాయి కూడా. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీతో జనసేన వ్యవహార శైలిపై బీజేపీ అనుమానించడం.. అదే సమయంలో ఏపీలో జగన్ సర్కారు తీరుపై బీజేపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో జనసేన అనుమానాపు చూపులు చూడడం ప్రారంభించింది. ఏపీలో ఒకలా… కేంద్రంలో మరోలా బీజేపీ వ్యవహరిస్తుండడం పవన్ కు మింగుడుపడడం లేదు. అదే సమయంలో టీడీపీతో కలిసి నడుస్తామన్న పవన్ ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఫలితంగా రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. అటు తరువాత జరిగిన పరిణామాల తరువాత వాటి మధ్య కటీఫ్ తప్పదన్న ప్రచారం ఊపందుకుంది.

అయితే రెండు రోజుల కిందట పవన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శకు రావడంతో రెండు పార్టీల మధ్య మంచి వాతావరణం నెలకొందన్న సంకేతాలిచ్చారు. అయితే అక్కడకు ఒక్కరోజైనా గడవలేదు. బీజేపీ అగ్రనాయకత్వంపై పవన్ అసంతృప్త వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకే పవన్ సిద్ధపడ్డారన్న టాక్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి బీజేపీ కోర్టులో బాల్ వేశారని.. వైసీపీతో ఫైట్ కు కలిసివస్తే కలుపుకుపోతారని.. లేకుంటే బీజేపీని విడిచిపెట్టడమే ఉత్తమమని జన సైనికులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన ద్వారా బీజేపీ లబ్ధి పొందుతుంది.. కానీ బీజేపీ నుంచి జనసేనకు ఎటువంటి రాజకీయ లబ్ధి చేకూరే చాన్స్ లేదని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం బీజేపీతో తెగతెంపులు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేనకు టీడీపీతో కలిసి వెళ్లేందుకు మొగ్గుచూపుతోంది. అటు టీడీపీ బీజేపీ, జనసేనతో కలవడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ మాత్రం ఒక్క జనసేనతోనే కూటమికి మొగ్గుచూపుతోంది. ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అయితే ఈ పరిణామ క్రమంలో మూడు పార్టీలు కలిసేందుకే ఎక్కువ చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.