Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధమవుతోంది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబా (LeT) కమాండర్ సైఫుల్లా కసూరి (ఖలీద్) పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో లోక్ కల్యాణ్ మార్గ్‌లో బుధవారం (ఏప్రిల్ 23, 2025) రెండున్నర గంటల పాటు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతీకార చర్యలతో పాటు భవిష్యత్తు భద్రతా వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ దాడి భారత్–పాక్ సంబంధాలపై మరింత ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: భారత్ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్ కు భారీ షాక్
సమావేశంలో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన CCS సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు (సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్‌ప్రీత్ సింగ్) హాజరయ్యారు. సమావేశం అనంతరం జైశంకర్ 9:15PM మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇవ్వడంతో పాటు, కాశ్మీర్‌లో భద్రతా లోపాలను సరిచేసే వ్యూహాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేస్తూ, ‘‘ఈ దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోము’’ అని స్పష్టం చేశారు.
లష్కరే తోయిబా కీలక సూత్రధారి
దర్యాప్తు సంస్థలు పహల్గామ్ దాడి వెనుక లష్కరే తోయిబా (LeT) కమాండర్ సైఫుల్లా కసూరి (ఖలీద్) పాత్రను గుర్తించాయి. ఖలీద్ ప్రస్తుతం ఔ్ఛఖీ యొక్క పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా ఉండటంతో పాటు, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా (JuD) యొక్క రాజకీయ విభాగమైన మిల్లీ ముస్లిమ్ లీగ్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. JuD పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ కార్యకలాపాలను ఖలీద్ పర్యవేక్షిస్తాడు. అమెరికా విదేశాంగ శాఖ 2016లో JuDని LeT అనుబంధ సంస్థగా గుర్తించి, ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. ఖలీద్ గతంలో పాకిస్థాన్‌లోని కంగన్‌పూర్‌లో పాక్ సైన్యం బలగాలతో సన్నిహితంగా పనిచేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 2025లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో జరిగిన సమావేశంలో ఖలీద్ భారత్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించినట్లు నివేదికలు తెలిపాయి.
పాక్ ఆర్మీతో సంబంధం?
పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆసిఫ్ గతంలో పాకిస్థాన్ సైన్యంతో కలిసి పనిచేసినందున ‘ఫౌజీ’ అనే పేరు వచ్చినట్లు దర్యాప్తు సమాచారం సూచిస్తోంది. దర్యాప్తు బందాలు ఆసిఫ్ ఫౌజీతో పాటు సులేమాన్ షా, అబు తల్హా అనే ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులు దాడి అనంతరం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని సేఫ్ హౌస్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి, యుఎస్ తయారీ ఎమ్4 రైఫిళ్లు, ఏకే–47/56 రైఫిళ్లను ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా తెలిసింది.
పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ పాత్రపై అనుమానాలు
ఈ దాడి వెనుక పాకిస్థాన్ సైన్యం మరియు ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మద్దతు ఉందని భారత భద్రతా సంస్థలు ఆరోపిస్తున్నాయి. దాడి యొక్క స్థాయి, కచ్చితత్వం, సైనిక–స్థాయి ఆయుధాల వినియోగం ఐఎస్‌ఐ శిక్షణ, ఆయుధ సహాయాన్ని సూచిస్తున్నాయని రిటైర్డ్ మేజర్ జనరల్ యశ్ మోర్ తెలిపారు. ఈ దాడి యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారత్‌లో ఉన్న సమయంలో, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన వారంలో జరగడం గమనార్హం. మునీర్ కాశ్మీర్‌ను పాకిస్థాన్ ‘‘జీవనాడి’’గా పేర్కొంటూ, కాశ్మీరీల పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉగ్రవాద సంస్థలపై పాక్ నియంత్రణను సడలించే సంకేతంగా భావిస్తున్నారు.
భారత్ తదుపరి చర్యలు
CCS సమావేశం తర్వాత, భారత్ ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇవ్వడంతో పాటు, కాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయనుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ దాడి దర్యాప్తును చేపట్టింది, స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల బహుమతిని ప్రకటించాయి. అదనంగా, సరిహద్దు వెంబడి గస్తీని ఉద్ధృతం చేయడం, డ్రోన్ నిఘాను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ దాడిని అంతర్జాతీయ వేదికలపై ఎత్తిచూపేందుకు భారత్ సన్నద్ధమవుతోంది, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ వంటి నాయకులు ఈ దాడిని ఖండిస్తూ, భారత్‌కు మద్దతు తెలిపారు.
Also Read: టర్కీలో మరోసారి భూకంపం.. తీవ్ర ప్రకంపనలు.. భయం గుప్పిట్లో ఇస్తాంబుల్