Padma Awards : ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులతో ప్రముఖులను సత్కరిస్తారు. ఈ ఏడాది కూడా భారత ప్రభుత్వం 139 పద్మ అవార్డులను మంజూరు చేసింది. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ అవార్డులు పొందిన వ్యక్తులు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అనే పదాలు తమ పేరు ముందు పెట్టుకోవచ్చా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదలుతుంది. ఇందుకు సంబంధించిన నియమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పద్మశ్రీకి పేర్లు ప్రకటన
ఈ సంవత్సరం 2025లో భారత ప్రభుత్వం 139 పద్మ అవార్డులను ఆమోదించింది. వీటిలో 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ అవార్డులు ఉన్నాయి. ఈ పేర్లను ప్రకటించిన తర్వాత, మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు. దేశంలో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి మూడు విభాగాలలో పద్మ అవార్డులు ఇవ్వడం గమనార్హం.
పేరు ముందు పద్మశ్రీ అని వాడుకోవచ్చా?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే..ఈ అవార్డు గ్రహీతలు తమ పేర్ల ముందు పద్మశ్రీ లేదా పద్మవిభూషణ్ ఉపయోగించవచ్చా?.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం, ప్రభుత్వం ఎటువంటి సైనిక బిరుదు లేదా విద్యా బిరుదును ప్రదానం చేయకూడదు. ఇది పద్మ అవార్డులు, సైనిక ర్యాంకులు, విద్యా బిరుదుల మధ్య తేడాను చూపుతుంది. పద్మ అవార్డులు ప్రభుత్వం ఇచ్చే సాధారణ గౌరవాలు, మిగిలినవి బిరుదులు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం డిగ్రీలను ప్రదానం చేయదు. అది అవార్డులు, గౌరవాలు మాత్రమే ఇవ్వగలదు.
గౌరవ పేరును ఉపయోగించలేరు
ప్రభుత్వం ఇచ్చే పద్మ విభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ అవార్డులు గౌరవాలు మాత్రమే. ఈ అవార్డు ఒక బిరుదు కాదు. ప్రభుత్వం ఏ పౌరుడికీ ఎలాంటి బిరుదు ఇవ్వలేదు. ఈ కారణంగానే ఈ అవార్డులు అందుకున్న వ్యక్తి లెటర్‌హెడ్‌లు, ఆహ్వాన కార్డులు, పోస్టర్లు, పుస్తకాలు మొదలైన వాటిపై తన పేరు ముందు లేదా తర్వాత భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి ఏ అవార్డును ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఇది కేవలం గౌరవం, బిరుదు కాదు. అంతే కాకుండా ఇవి గౌరవ పూర్వకంగా ఇచ్చేవి మాత్రమే.. వాటిని అందుకున్న వ్యక్తులకు ప్రభుత్వం ఎలాంటి డబ్బులను అందజేయదు.