కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఢిల్లీలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికులు ఆక్సీజన్ అందని కారణంగానే చనిపోయారని వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఈ పరిస్థితి రోజుల తరబడి కొనసాగింది. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకొని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అటు ఢిల్లీ సర్కారు – కేంద్ర సర్కారు మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. ఒక దశలో తాను ముఖ్యమంత్రి అయిఉండి కూడా.. ఏమీ చేయలేకపోతున్నానని, ఢిల్లీలో ఆక్సీజన్ ప్లాంట్లు లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీ.
అయితే.. ఆప్ సర్కారు అవసరాని కన్నా ఎక్కువ ఆక్సీజన్ కోరుతోందనే ఆరోపణలు రావడంతో.. సుప్రీం కోర్టు ఓ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే.. ఈ కమిటీ నివేదిక రూపొందించిందని, ఇందులో భారీ తేడాలు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీకి రోజుకు 289 మెట్రికల్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే అవసరం ఉండగా.. ఆప్ ప్రభుత్వం మాత్రం 1140 మెట్రిక్ టన్నులు డిమాండ్ చేసిందని ఆ నివేదిక చెప్పినట్టు లేటెస్ట్ గా మీడియా కథనాలు వస్తున్నాయి.
దీంతో.. కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ఘోరమైన నేరానికి పాల్పడ్డారని, దీనివల్ల ఇతర ప్రాంతాల్లోని చాలా మంది ప్రాణాలు కోల్పోయారని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ చర్యకు గానూ దేశానికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత బీఎల్ సంతోష్ డిమాండ్ చేశారు.
అయితే.. దీనిపై ఆప్ సర్కారు తీవ్రంగా స్పందించింది. బీజేపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని, తమ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేపడుతోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో తాము మాట్లాడమని, బీజేపీ నేతలు చెబుతున్న నివేదిక ఏదీ తమకు తెలియదని, అది తాము ఆమోదించింది కాదని చెప్పారు. తాము సంతకాలు చేసిన అసలైన నివేదిక చూపించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా.. మరోసారి కేంద్రం-ఢిల్లీ మధ్య ఆక్సీజన్ పంచాయితీ మొదలైంది.