గత ఏడాది ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి హోమ్ మంత్రిగా చేరిన అమిత్ షా అటు ప్రభుత్వంలో, ఇటు బీజేపీలో కూడా తిరుగులేని నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ప్రాబల్యానికి ఫిబ్రవరి చివర జరిగిన అల్లర్లు గండి పడేటట్లు చేశాయి. అమిత్ షా పరిపాలన సామర్ధ్యం పట్ల మొదటి సారి బిజెపి వర్గాలలోని అనుమానాలు కలిగేటట్లు చేశాయి.
అమిత్ షా ఒక మాట అంటే ప్రధాని మోదీ అన్నట్లే అందరూ భావించేవారు. హడావుడిగా, ఎటువంటి క్షేత్రస్థాయి సన్నాహాలు జరుపకుండా ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి సంచలన నిర్ణయాలను అంతా తానే అయి, అమలు జరుపుతున్నా ఎవ్వరు ప్రశ్నించలేదు. ప్రభుత్వంలో, పార్టీలో తనను తిరుగులేని నేతగా బలపడెటట్లు చేసుకోవడం కోసమే వీటిని అర్ధాంతరంగా ప్రవేశపెట్టారని పలువురు భావిస్తున్నారు.
కానీ ఢిల్లీ అల్లర్లు, ఆ వెంటనే తబ్లీఘి జమాత్ సదస్సు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిలతో ప్రభుత్వంలో అమిత్ షా ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నది. మోదీ ప్రభుత్వం కరొనపై జరుపుతున్న పోరాటంలో అమిత్ షా క్రియాశీల పాత్ర ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదివరలో వలే ఆయన ప్రభుత్వ విధానాలను నిర్ధేశించే పరిస్థితులలో ఉన్నట్లు కనబడటం లేదు.
తాజాగా, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కలిపిస్తూ కేంద్ర మంత్రివర్గం ఒక ఆర్డినెన్సు తీసుకు రావాలని నిర్ణయించడం ఒక విధంగా అమిత్ షా ప్రాబల్యానికి పెద్ద శరాఘాతమే అని భావించవలసి ఉంటుంది. ఎందుకంటె డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరిపిన వారికి జైలు శిక్ష పడే విధంగా గత ఏడాదే కేంద్ర ఆరోగ్య శాఖ ఒక బిల్లును తయారు చేసింది.
స్వయంగా వైద్యుడైన ఆరోగ్య మంత్రి డా. హర్ష వర్ధన్ చోరువాత ఈ బిల్లును రూపొందించి, హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపారు. అయితే ప్రత్యేకంగా అటువంటి బిల్ అవసరం లేదని అంటూ అమిత్ షా దానిని పక్కన పడవేశారు. కనీసం మంత్రివర్గం ముందుకు కూడా తీసుకు రాలేదు.
కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో దేశంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలలో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా హోమ్ మంత్రిగా అమిత్ షా పట్టించుకోననే లేదు. అయితే ఈ దాడులకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించడంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
ఇఎంఎ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా చర్చలు జరుపవలసి వచ్చింది. వారికి ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వవలసి వచ్చింది. కొద్దీ సేపటికి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొన్ని నెలల క్రితం తాను పక్కన పడవేసిన బిల్లును తీసుకు వచ్చి, ఆర్డినెన్సు జారీ చేయాలని నిర్ణయించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
మొన్నటి వరకు అమిత్ షా `కాబోయే ప్రదాని’. ప్రభుత్వంలో ఏ విషయంలో అయినా ఆయనే ముందుండే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రధాని మోదీ ముందుండి కరోనా వ్యతిరేక పోరాటం నడిపిస్తున్నారు.