
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లాబొరేటరీ (ఎంవిఆర్డిఎల్)ని ప్రారంభించింది. దీన్ని రక్షణమంత్రి వీడియో కాన్ఫరన్స్ ద్వారా ప్రారంభించారు. కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు వాక్సీన్ తయారీ పరిశోధనల ఇక్కడ జరుగుతాయి. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ ల్యాబ్ ని రూపొందించింది.
ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో తెలంగాణలో కరోనా పరీక్షలు మరింత వేగవంతం కానున్నాయి. ఈ ల్యాబ్ లో ప్రతి రోజు వెయ్యికి పైగా నమూనాలను పరీక్షించవచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ లో ఈల్యాబ్ రూపొందించినందుకు డీఆర్‌డీవోకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ విభాగం, సాయుధ బలగాలు సైతం అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
తెలంగాణలో ఇప్పటి వరకు 943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 194 మంది కోలుకున్నారు. మరో 24 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.