YS Jagan Supporters : ఏపీలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఇంకా ఏడాది వ్యవధి కూడా లేకపోవడంతో అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. చంద్రబాబు జిల్లాల పర్యటనలతో చుట్టేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ లు ముగించి ఎన్నికల సమరంలోకి దిగాలని భావిస్తున్నారు. అటు సీఎం జగన్ సైతం దూకుడు పెంచారు. ప్రజల ముంగిటకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతున్నారు. మరోవైపు మా నమ్మకం నువ్వే జగన్, జగనే మా భవిష్యత్ అంటూ స్టిక్కర్లు అతికించే కార్యక్రమం చేపట్టారు. కొత్తగా జగనన్నకు చెబుదాం అంటూ ఓ కాల్ సెంటర్ ప్రారంభించేందుకు సైతం సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 7 నుంచి జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకూ నిర్వహించారు. నిర్వహణ బాధ్యతలను గృహసారథులు, కన్వీనర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులకు అప్పగించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల గురించి ఆరాతీశారు. వారి నుంచి వివరాలు సేకరించి నమోదుచేసుకున్నారు. ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మెగా సర్వే పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. . రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన సమయంలో ఏడు లక్షల మంది గృహసారథులు, నాయకుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా కార్యక్రమ నిర్వహణపై సీఎం జగన్ స్పందించారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా సర్వే లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి 16 లక్షల కుటుంబాలు సీఎం జగన్ పాలనకు మద్దతు ప్రకటించాచియి. కోటి 45 లక్షల కుటుంబాల నుంచి ప్రభుత్వ పాలన పైన అభిప్రాయ సేకరణ చేసారు. అందులో వచ్చిన స్పందన సీఎం జగన్ స్పందించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన కేడర్ కు ధన్యావాదములు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుడతామని జగన్ ప్రకటించారు. దానిని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.