Odisha Forest Department: ఒడిస్సాలో అటవీశాఖ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలకు.. మరో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెరుగులు దిద్దారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఒడిస్సా ప్రభుత్వం స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే అడవుల సంరక్షణ, కలప అక్రమ రవాణా నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ వంటి వాటికి అత్యాధునిక వాహనాలు అవసరమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అటవీ శాఖ అత్యాధునిక థార్ వాహనాలను అందుబాటులోకి తేవడం అక్కడ వివాదాస్పదంగా మారింది.
* అటవీ ప్రాంతం అధికం..
ఒడిస్సా లో అటవీ ప్రాంతం అధికం. దండకారణ్యాలు ఉంటాయి. వాటిలోకి వెళ్లడం అత్యంత సాహసం కూడా. ఎందుకంటే ఒకవైపు విలువైన అటవీ సంపద, మరోవైపు వన్యప్రాణులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తూర్పు కనుమలు ఒడిస్సాలో విస్తరించి ఉంటాయి. ప్రతి జిల్లాలో అడవులు ఉంటాయి.. అక్కడ అటవీ శాఖలో విధులు నిర్వహించడం కత్తి మీద సాము. ఈ నేపథ్యంలో అడవుల్లోకి వేగంగా చొచ్చుకెళ్లేందుకు.. ఆపై కొండ ప్రాంతాలను సులువుగా ఎక్కేందుకు ఈ థార్ వాహనాలు అయితే సులువుగా ఉంటాయని భావించి ఏడు కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు ఒడిస్సా అధికారులు. వాటికి అత్యాధునికమైన లైట్లు, పరికరాలు అమర్చారు. వాటికి అయ్యే ఖర్చును ఐదు కోట్ల రూపాయలుగా చూపారు.
* బిజెపి పాలనలో..
ఒడిస్సా లో 2024 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు బిజేడి పాలన సాగింది. అటవీ శాఖలో అవినీతి మరకరావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఇటువంటి ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందే మేల్కొంది. అయితే అటవీ శాఖలో విధి నిర్వహణ కోసమే తాము ఆ వాహనాలు కొనుగోలు చేసి.. చేర్పులు మార్పులు చేశామని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. అయితే ఈ అంశం జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీసింది