NTR Statue Khammam: ఒకప్పుడు అంటే వామపక్షాలు బలంగా ఉన్నప్పుడు వారు చేస్తున్న ఉద్యమాల కోసం పీడిత ప్రజలు అండగా నిలిచేవారు. ఎర్రజెండా పార్టీల నాయకులు గ్రామాల్లోకి వస్తే తల ఇంత వేసుకొని కూడో, గుడ్డో ఇచ్చేవారు. అలాంటి ఉద్యమాలు జనాలను కదిలించాయి. పెత్తందారీ వ్యవస్థను సమూలంగా పెకిలించి వేశాయి. ఆ ఉద్యమాలు పీడిత ప్రజల కోసం కవచం లాగా పని చేశాయి. అది ఒక బస్తర్ కావచ్చు. శ్రీకాకుళం కావచ్చు, జనతన సర్కార్ కావచ్చు. కాకపోతే ఆ ఉద్యమాలు అన్నిచోట్ల జరగకపోవచ్చు. కానీ అవి తీసుకొచ్చిన మార్పు అంతా కాదు. అవి వేసిన పునాదుల మీదనే నేటికీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇదంతా ఒక చరిత్ర లాగా ఉండవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి చరిత్ర ఒక నిఘంటువు.
కులస్వామ్యం పెరిగింది
ఇక అనేకానేక ఉద్యమాల తర్వాత..ఉద్యమాల రూపాలు పూర్తిగా మారిపోయాయి. ఇందులోకి కులాలు ప్రవేశించాయి. రెడ్లు బలంగా ఉన్నచోట కమ్మలు, కమ్మలు బలంగా ఉన్నచోట రెడ్ల దగ్గర ఈ సర్దుబాటు జరుగుతూ ఉండేది. ఈ రెండు కులాలు లేని దగ్గర బాపన, నియోగి అనే కులాలు వాటికి చేదోడువాదోడుగా ఉండేవి. అయితే కొన్ని సమూహాలు ఎర్రజెండాలను ఎత్తుకోవడం వెనుక చాలా కారణాలు ఉండేవి. వాటిల్లో ప్రధానంగా భూమి, అధికారం, ఆధిపత్యం ముందు వరుసలో ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతాల్లో కూడా ఈ మూడు అంశాలే బలమైన భూమిక పోషించేవి. అయితే ఇవి మూడు ఒకదాని తర్వాత ఒకటి కుర్చీల ఆటలాగా మారుకుంటూ వచ్చాయి.
ఇలా చెప్పొచ్చు
ఒక ఊరిలో “ఏ” అనే ఒక దుర్మార్గుడు ఉంటాడు. అక్కడ భూమి మొత్తం అతడి కబ్జాలో ఉంటుంది. ప్రజలు కష్టాలు పడుతూ ఉంటారు. సినిమాల్లో చూపించినట్టు ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ “బీ” నాయకత్వంలో ఒక పార్టీ బలంగా వ్యక్తులను సమీకరించి, అవసరం అనుకుంటే ” ఏ” ను చంపేసి అక్కడ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగేలాగా చూస్తాడు. అయితే భూమి మాత్రం “ఏ” సామాజిక వర్గం నుంచి “బీ” సామాజిక వర్గానికి బదిలీ అవుతుంది. ఇంక మరొక చోట నుంచి “బీ” నుంచి “సీ”కి బట్వాడా అవుతూ ఉంటుంది. అలా గడిచిన ఏడు దశాబ్దాలలో భూమి స్థిరంగానే ఉంది. కానీ దోపిడి కులాల చేతిలోనే చిక్కిపోయింది. మార్పు కోసం తమ రక్తాన్ని ఒలకబోసిన సామాన్యుల స్తూపాలు ఇప్పటికీ రచ్చబండల దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే దీని ప్రకారం ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనుక బలమైన త్యాగం ఉంటుంది.
చర్విత చరణం
పైన చెప్పినట్టు “ఏ బి సి” కులాలు కాకుండా వాటికి పార్టీలను అన్వయించుకున్నప్పటికీ అదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 100 సంవత్సరాలలో అధికార మార్పిడి మూలంగా ” ఏ బి సి” సమూహాలు తప్ప ఎవరి బతుకు చూసినా ఇలాగే ఉంది. ఖమ్మం రాజకీయ ముఖచిత్రం చూస్తే పైన చెప్పిన దాని కంటే మహా కంపరంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఖమ్మం నడిబొడ్డులో శ్రీ శ్రీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు నిర్వహించిన సమావేశంలో ఇప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ “ఆంధ్రాలో మా కాలోజి, దాశరధి విగ్రహం పెట్టే నిగ్రహం అక్కడి సమాజానికి ఉందా” అని ఒక బలమైన సవాల్ విసిరాడు. తెలంగాణను వ్యతిరేకించిన శ్రీశ్రీని గౌరీ శంకర్ ఒక కవిగా ఆదరించాడు. విగ్రహం నిలబెట్టే తెలంగాణ సమాజానికి ఔదార్యం ఉందని నిరూపించాడు. ఎందుకంటే తెలంగాణ ఒక బాధిత గొంతు కనుక. ఇందులో ఎటువంటి అతిశయోక్తులు లేవు కాబట్టి తెలంగాణ సమాజం నుంచి బలమైన ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలే తెలంగాణ ఏర్పాటును సాధించుకున్నాయి.
లకారం చెరువు గురించి చెప్పుకోవాలి
ఖమ్మం గురించి ప్రస్తావించాం కాబట్టి లకారం చెరువు గురించి కూడా చెప్పుకోవాలి. ఒకప్పుడు ఈ చెరువు వందల ఎకరాలకు సాగునీరు, వేలాదిమందికి తాగునీరు అందించేది. ఇప్పుడు అది కబ్జాలపాలైంది. దాని చుట్టూ అనేక ఆసుపత్రులు, పెద్ద పెద్ద భవంతులు, క్యాసినో బార్ లు, ట్యాంక్ బండ్లు విస్తరించాయి. ఇక కుంగి కుషికించిపోయిన లకారం చెరువులో మే 28న 56 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారు. దాని ఆవిష్కరణకు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు కల్వకుంట్ల తారక రామారావు వచ్చినా ఖమ్మం ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడరు. ఎందుకంటే ఇప్పుడున్నది ఎన్నికల కాలం కాబట్టి, ఆ కులానికి సంబంధించిన ఓట్లు కావాలి కాబట్టి. ఇక ఈ విగ్రహ ఖర్చు 2.50 కోట్లు. దీనిని ఎవరు పెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో ముంజేతి కంకణమే.
ఇదివరకు విగ్రహాలున్నాయి
ఖమ్మంలో ఇదివరకు నెహ్రూ, ఇందిరా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వంటి దిగ్గజాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. కవుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో అసలు ఉనికే లేని కాలంలో శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నామని, దానికి ఖర్చుపెట్టిన వారు చెబుతున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు. అందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. ఆయన విగ్రహం పెడితే ఆయన పుట్టిన రాష్ట్రంలో, గెలిచిన నియోజకవర్గంలో, ముఖ్యమంత్రిగా పని చేసిన హైదరాబాదులోనో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడా లేనిది ఖమ్మంలో మాత్రమే ఎందుకు పెడుతున్నారు అంటే.. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందుకు కారణం. ఇక్కడ ఉన్న కళాకారులు, విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు కమ్మనైన పలుకులు పలుకుతారు. పొరపాటున ఏవైనా వ్యతిరేక గొంతులు స్వరం కలిపితే వాటిని మధ్యలోనే తుంచేస్తారు. నిరసన స్వరాన్ని తొక్కేసి 100% ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అనే డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తారు. దీని వెనుక కారణం ఆ కులానికి ఎరక.. వాటి వెనుక పోగుపడి ఉన్న డబ్బులకు ఎరుక.
వారి కనుసన్నల్లోనే..
ఇక ఈ విగ్రహం ఏర్పాటు ఒక క్యాబినెట్ మినిస్టర్ కనుసన్నల్లో, అమెరికాలో ఓ కులానికి అధ్యక్షుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఖమ్మంలో పనిచేస్తున్న వాడిగా నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక దోపిడీకి ఖమ్మం నగరం ఒక గేట్ వే. ఇక ఇక్కడ విగ్రహం ఏర్పాటు పరిశీలన తర్వాత మొత్తం ఆంధ్రలో ఎంత మంది తెలంగాణ వాదులవి, కవులవి, మేధావుల విగ్రహాలు ఉన్నాయో చెప్పగలగాలి. ఖమ్మం మాత్రమే ఎందుకు విగ్రహ ఏర్పాటుకు కేంద్రం అయిందో చెప్పాలి. దీనికి సమాధానం చాలా సింపుల్. అందుకే కదా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, మిలియన్ మార్చ్, సాగరహారం, ధూమ్ ధామ్, నిరవధిక నిరాహార దీక్ష, వంట వార్పు అనేవి ఆత్మగౌరవ ప్రకటనలుగా నాలాంటివారు చెప్పుకునేది.