
కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్ ముఖచిత్రమే మారిపోతున్నది. బట్టలు, నగలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు.. వస్తువు ఏదైనా కొనుగోలుదారుల వద్దకే దుకాణాలు కదిలి రానున్నాయి.
సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, తనిష్క్, క్రోమా, లైఫ్ స్టైల్, విజయ్ సేల్స్, గ్రేట్ ఈస్టర్న్ రిటైల్, సంగీతా మొబైల్స్ వంటి ఎన్నో బ్రాండ్లు తమ ఉత్పత్తులతో వాహనాలను నింపి గృహ సముదాయాల (భారీ అపార్టుమెంట్లు-కాలనీలు) వద్దకు వెళ్లాలని చూస్తున్నాయి.
లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక సంస్థలు, దుకాణాలు వ్యాపారానికి దూరమయ్యాయి. ఈ క్రమంలో కస్టమర్లు మునుపటిలా షాపింగ్‌చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో అనేక వ్యాపార సంస్థలు తమ రూటు మారుస్తున్నాయి.
అత్యవసరం కాని వస్తూత్పత్తుల విక్రయాలకూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు మారిన మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ స్టోర్లకు శ్రీకారం చుడుతున్నాయి.
తోపుడు బండ్లపై వస్తువులను అమ్ముకునే చిరు వ్యాపారులను ఇప్పుడు బడా వ్యాపారులు అనుసరించబోతున్నారు. వ్యాన్లలో తమ ఉత్పత్తులను పెట్టుకుని భారీ అపార్టుమెంట్లు, కాలనీల్లో మొబైల్ షాపులను తెరువబోతున్నారు. కస్టమర్లు నేరుగా తమకు నచ్చిన వస్తువును ఎంచుకుని కొనుగోలు చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది.
బెంగళూరులోని ఆరు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి మొబైల్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతి పొందారు. ఇలాగే మరికొన్ని రాష్ట్రాలలో మొబైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లోకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారని, మరో 6 నెలలు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చని, ఆ తర్వాత కూడా కొనసాగే వీల్లేకపోలేదని భావిస్తున్నారు.
టాటా గ్రూప్ బ్రాైండ్లెన తనిష్క్, టైటాన్ సైతం జూన్‌కల్లా పలు నగరాల్లో ఇండ్ల వద్దకే దుకాణాల సూత్రాన్ని అవలంభించనున్నాయి. సంగీతా మొబైల్స్, గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ కూడా ఈ దిశగానే నడుస్తున్నాయి.