Ponguleti Srinivasa Reddy : టార్గెట్‌ పొంగులేటి.. ఆయన సోదరుడికి నోటీసులు

ఖమ్మంఅర్బన్‌ మండలంలోని వెలుగుమట్ల వద్ద సర్వే నెంబరు 140లో సరిహద్దు ఎన్‌ఎస్‌పీ భూమి సంయుక్త సర్వేకోసం హాజరుకావాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డికి ఖమ్మం ఎన్‌ఎస్‌పీ అధికారులు వాట్సాప్‌ ద్వారా ఎన్‌ఎస్‌పీ ఈఈ నోటీసులు జారీచేశారు.

Written By: NARESH, Updated On : July 15, 2023 9:24 pm
Follow us on

Ponguleti Srinivasa Reddy : ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని తెలంగాణ అసెంబ్లీని తాకనివ్వను. దీని కోసం ఎంత దాకాయినా వెళ్తాను’ ఇదీ గత కొంతకాలంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న సవాల్‌. అన్నట్టుగానే ఆయన కారు దిగి ‘చేయి’ అందుకున్నారు. ప్రచార కమిటీ వైస్‌ చైర్మన్‌ గా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో మరిన్ని చేరికలకు శ్రీకారం చుడుతున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కలిశారు. తెరవెనుక మంతనాలు చేపడుతున్నారు. సహజంగానే ఈ పరిణామం బీఆర్‌ఎస్‌కు నచ్చడంలేదు. దీంతో పొంగులేటి ఎక్కడ దొరుకుతాడా? ఎక్కడ గట్టిగా ఒత్తుదామా? అని చూస్తోంది. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పొంగులేటి ఆర్థిక వ్యవహారాల మీద ఒక కన్ను వేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎంవో కార్యాలయం కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే పొంగులేటి సోదరుడికి ఓ భూ వ్యవహారానికి సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా ఆగమేఘాల మీద.. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి కలకలం చెలరేగింది.

వాట్సాప్‌ ద్వారా నోటీస్‌

ఖమ్మంఅర్బన్‌ మండలంలోని వెలుగుమట్ల వద్ద సర్వే నెంబరు 140లో సరిహద్దు ఎన్‌ఎస్‌పీ భూమి సంయుక్త సర్వేకోసం హాజరుకావాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డికి ఖమ్మం ఎన్‌ఎస్‌పీ అధికారులు వాట్సాప్‌ ద్వారా ఎన్‌ఎస్‌పీ ఈఈ నోటీసులు జారీచేశారు. వెలుగుమట్ల వద్ద ఎన్‌ఎస్‌పీ కాలవ నిమిత్తం సేకరించిన ఎన్‌ఎస్‌పీ భూమి సరిహద్దు నిర్ణయిస్తామని, ఇరిగేషన్‌, రెవెన్యూ సంయుక్త సర్వేకు శనివారం ఉదయం 9గంటలకు హాజరుకావాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ఈఎన్‌ఎస్‌పీ కాలువకు సమీపంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సం బంధించిన ఎస్‌ఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ ఉంది. ఈభూమికి సంబంధించిన పత్రాలతో సర్వేకు హాజరుకావాలని ప్రసాదరెడ్డికి ఎన్‌ఎస్‌పీ అధికారులు నోటీసులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.

ఒత్తిళ్ల పర్వం మొదలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో ఒత్తిళ్ల పర్వం మొదలయింది. కాగా దీనికి ప్రసాదరెడ్డి శుక్రవారం రాత్రి పదిగంటల సమయంలో వాట్సాప్‌ ద్వారా సంయుక్త సర్వేకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ‘నేను వైరల్‌ ఫీవర్‌తో మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాను. హైదరాబాదులో ఉన్న నేను ఖమ్మం రాలేను. నోటీసు ఇచ్చిన 12గంటల్లో హాజరుకావడం సాధ్యం కాదు. అలాగే ఎన్‌ఎస్‌పీకి సంబంధించిన భూ రికార్డుల సమాచారం తనకు ముందుగా తెలపాలని’ ప్రసాదరెడ్డి ఎన్‌ఎస్‌పీ ఈఈకి పంపిన సమాధానంలో తెలిపారు. అలాగే సంయుక్త సర్వేకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.