AP Opposition Leaders: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి దాసోహమన్నట్టు వ్యవహరిస్తోంది. నడి రోడ్డుపై హత్యాయత్నాలు చేసేవారికి ప్రొటక్షన్ కల్పిస్తున్నారు. అటువంటి వారు నేరుగా పోలీస్ స్టేషన్లలో పుట్టిన రోజు వేడుకలు చేసుకునే వెసులబాటు ఏపీలో ఉంది. కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న విపక్ష నేతలను మాత్రం ఎలాంటి సెక్యూరిటీ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీస్ శాఖ ఉంది. వారు ఇంటి నుంచి బయలుదేరే సమయానికి ప్రత్యక్షమవుతున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఒక వేళ సాహిసించి అడుగు బయటపెడితే కృత్రిమ ఉద్రిక్తతలకు తావిచ్చి.. వాటినే సాకుగా చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీ ప్లాన్డ్ గా విద్యుత్ లైట్లు ఆపేసి రాళ్ల దాడికి పురమాయిస్తున్నారు. పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల చర్యలు ఇటీవల శృతిమించుతున్నాయి.

విపక్ష నేతలు అయితే దాడులు.. లేకపోతే కేసులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్ఛగా తిరిగే రోజులు కనిపించడం లేదు. ఎక్కడైనా వారు పర్యటిస్తామంటే వైసీపీ నేతలు విధ్వంసాలకు దిగుతున్నారు. ఆ పర్యటనలను వివాదాస్పదం చేస్తున్నారు. సహజంగా ఇది పోలీస్ శాఖ పనితీరును ప్రశ్నార్థకమవుతుంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహం, అధికార పక్షానికి దాసోహం.. మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చగా మారుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదంగా భావించే వారు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇది అల్టిమేట్ గా వైసీపీ సర్కారు పనితీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దూకుడు చర్యలకు దిగుతోందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే వ్యూహాత్మకంగా దాడులు చేయిస్తుందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఈ అభిప్రాయం రోజురోజుకూ పెరుగుతోంది.
జనసేన అధినేత పవన్ విశాఖ పర్యటనను ఇటువంటి ప్లాన్ తోనే అడ్డుకున్నారు. జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా హోటల్ కే పరిమితం చేశారు. విశాఖ నుంచి బలవంతంగా విజయవాడ పంపించారు. ఇటీవల విపక్ష నేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పనిగట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విధ్వంసాలకు దిగుతున్నారు. నందిగామ పర్యటనలో చంద్రబాబును టార్గెట్ గా చేసుకొని రాయి విసిరారు. అది భద్రతా సిబ్బంది ఒకరికి తగలడంతో గాయమైంది. అదే చంద్రబాబుకు తిగిలి ఉంటే పరిస్థితి ఏమిటి? చర్యకు ప్రతిచర్య అన్నట్టు టీడీపీ శ్రేణులు కూడా ఎదురుతిరిగితే శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి? అటు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించిన ప్రతిసారి అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. విపక్ష నేత, జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడు అని చూడకుండా రాళ్ల దాడికి దిగుతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు.

పోలీసులు ఉన్నది ప్రజల మాన, ప్రాణాలను కాపాడేందుకేనని గుర్తెరగాలి. కానీ తాము భద్రతకు కాదు.. ఉద్రిక్తతలను పురమాయించడానికేనంటూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంటోంది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే.. దానిని అడ్డుకోకండి కానీ.. పోటీగా గర్జనలు ఏర్పాటుచేసుకోండి అని సాక్షాత్ రాష్ట్ర పోలీస్ బాసే సూచించడం దేనికి సంకేతం? ఒకటి మాత్రం సూటిగా చెప్పొచ్చు. ఏపీలో సామాన్యుడి నుంచి విపక్ష నేతల వరకూ భద్రత కొరవడింది. అది ప్రజలకు ప్రభుత్వం అప నమ్మకం కలిగేలా చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా వైసీపీ సర్కారుదే. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.