Pawan Kalyan- Jagan: వైసీపీ సర్కారును టార్గెట్ చేసుకొని పవన్ మరో పోరాటానికి సిద్ధపడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని శనివారం సందర్శించనున్నారు. గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణల పేరిట స్థానికుల నిర్మాణాలను మునిసిపల్ అధికారులు తొలగించారు. అయితే ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్నవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన ప్లీనరీ ఇప్పటంలో నిర్వహించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురైనా గ్రామస్థులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరీ ప్లీనరీ నిర్వహణకు స్థలం చూపించారు. ఇది పవన్ కు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో పవన్ గ్రామానికి రూ.50 లక్షలు అందించారు. ఆ సొమ్ముతో గ్రామంలో కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు.

అయితే అప్పటి నుంచి కక్ష పెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పటం గ్రామస్థులపై రివేంజ్ తీసుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగా 120 అడుగుల రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించే ప్రయత్నంచేశారు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్మాణాలను తొలగిస్తున్నారంటూ గ్రామస్థులు చెబుతున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. స్టే లభించడంతో ప్రస్తుతానికి ఆక్రమణ తొలగింపు నిలిపివేశారు. అయితే రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇప్పటం గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష కట్టిందన్న కామెంట్స్ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించడానికి పవన్ నిర్ణయించారు. కూల్చివేతతో పాలనను ప్రారంభించిన వైసీపీ గవర్నమెంట్ త్వరలో కుప్పకూలడం ఖాయమని పవన్ కామెంట్స్ చేశారు.
విశాఖ ఘటన తరువాత పవన్ క్షేత్రస్థాయి పర్యటన ఇదే. వైసీపీ సర్కారుపై ఏ రేంజ్ లో ఫైర్ అవుతారోనని అటు అధికార పార్టీ, ఇటు జన సైనికులు ఎదురుచూస్తున్నారు. పవన్ మాటల దాడి పెంచే అవకాశముందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పవన్ సంచలన వ్యాఖ్యలను సానుభూతి కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ నేతలకు పెద్దగా వర్కవుట్ కాలేదు. వైసీపీ నేతల వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ… వాటితో పోల్చితే పవన్ కామెంట్స్ ను ప్రజలు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు తమను ఆదరించారని ఓ గ్రామంపై కత్తి కట్టడాన్ని పవన్ తప్పకుండా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఆయన ఆగరని.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతారని జనసైనికులు భావిస్తున్నారు.

ఇప్పటం గ్రామంలో ఆక్రమణలపై గత ఏప్రిల్ నుంచి నోటీసులు ఇస్తున్నామని.. కానీ ఆక్రమణదారులు పట్టించుకోవడం లేకపోవడంతోనే తొలగింపులకు దిగామని తాడేపల్లి మునిసిపల్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. విపక్షాలు ఈ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అటు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మొత్తానికైతే ఇప్పటంలో పవన్ పర్యటన మాత్రం సంచలనాలకు కేంద్ర బిందువయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటికేవైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించినట్టు చెబుతున్న పవన్ పదునైన విమర్శనాస్త్రాలు సంధించే అవకాశముంది.