JNU VC ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్.యూ) వీసీ శాంతిశ్రీ ధూళిపూడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా దేవుళ్లు అగ్రవర్ణాల వారు కాదని నోరుపారేసుకున్నారు. మనుశాస్త్రం ప్రకారం హిందూ దేవుళ్లందరూ షెడ్యూల్ కులాలకు, తెగలకు చెందినవారేనని వీసీ శాంతిశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ దేవుడు బ్రాహ్మణుడు కాదని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి.

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ ఉపన్యాస శ్రేణిలో కీలకోపన్యాసం చేస్తూ జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ‘ హిందూ దేవుళ్లు మనుధర్మ శాస్త్రంలో అగ్రవర్ణాలు కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. శివుడు ఒక షెడ్యూల్ కులానికి లేదా తెగకు చెందినవాడు అయి ఉండాలి. ఆయన శ్మశానంలో ఉంటూ ఒంటిపై సర్పాలతో.. తక్కువ దుస్తులతో ఉంటాడు. బ్రాహ్మణులు అలా శ్మశానాల్లో కూర్చోగలరని నేను అనుకోవడం లేదు’ అంటూ శాంతిశ్రీ ఏకంగా దేవుడినే అవమానించేలా మాట్లాడారు. జగన్నాథుడిని తీసుకుంటే ఆయన గిరిజనుడు. కాబట్టి, మనం ఇప్పటికీ ఈ వివక్షను ఎందుకు కొనసాగిస్తున్నామన్నది ప్రశ్న.
“మనుస్మృతి” ప్రకారం స్త్రీలందరూ శూద్రులు. కాబట్టి, ఏ స్త్రీ కూడా తాను బ్రాహ్మణుడనని లేదా మరేదైనా క్లెయిమ్ చేసుకోదు. వివాహం ద్వారానే మీకు భర్త లేదా తండ్రి కులాన్ని మీరు పొందుతారని నేను నమ్ముతున్నాను. ఇది అసాధారణమైన తిరోగమనం అని నేను భావిస్తున్నాను, ” వీసీ స్త్రీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
“దురదృష్టవశాత్తూ, కులం అనేది పుట్టుకపై ఆధారపడి లేదని చెప్పే చాలా మంది ఉన్నారు, కానీ నేడు అది పుట్టుకపై ఆధారపడి ఉందని భావిస్తానని వీసీ అన్నారు. బ్రాహ్మణుడు చెప్పులు కుట్టేవాడు అయితే వెంటనే దళితుడు అవుతాడా? అతను అలా చేయడని.. ఇటీవల రాజస్థాన్‌లో ఒక దళిత యువకుడు అగ్రవర్ణానికి చెందినవారి నీళ్ళు ముట్టాడన్న కారణంగా కొట్టి చంపబడ్డాడు. ఇది మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. తోటి మనిషిని కులం కారణంగా దూరం పెడుతూ మనం ఎలా ప్రవర్తించగలం? వీసీ నిలదీసింది.
భారత సమాజం బాగుపడాలంటే, కుల నిర్మూలన అసాధారణంగా ముఖ్యమైనదని వీసీ వాదించారు.. చాలా వివక్షాపూరితమైన, చాలా అసమానమైన ఈ గుర్తింపు గురించి మనం ఎందుకు ఉద్వేగానికి లోనవుతామో నాకు అర్థం కావడం లేదు. కృత్రిమంగా నిర్మితమయ్యే ఈ గుర్తింపును రక్షించడానికి ఎంతకైనా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
వీసీ శాంతి శ్రీ ఆదినుంచి వివాదాస్పదురాలిగా ముద్రపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏరికోరి హిందుత్వ భావజాలం ఉన్న ఈమెను సెక్యూలర్ ఆధిపత్యం ఉండే జేఎన్.యూ వీసీగా నియమించిందన్న ఆరోపణలున్నాయి. తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం మరియు ఇంగ్లీష్ తెలిసిన పండిట్ శాంతిశ్రీ గతంలో సావిత్రి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో రాజకీయాలు మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ ఫిబ్రవరిలో ఆమె ఐదు సంవత్సరాల కాలానికి జేఎన్.యూ మొదటి మహిళా వైస్ ఛాన్స్ లర్ గా నియమితులయ్యారు. ఆమె పరిశోధనలో అంతర్జాతీయ సంబంధాలు, ఆసియా అధ్యయనాలు, సంస్కృతి మరియు విదేశాంగ విధానం, సంఘర్షణ, హింస మరియు లింగభేదాలు ఉన్నాయి. కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.