Modi Cabinet : కేంద్ర క్యాబినెట్లో జనసేనకు చోటు దక్కలేదు ఎందుకు? పవన్ వద్దన్నారా? కేంద్ర పెద్దలు ఇవ్వలేదా? అసలు ఏం జరిగింది? దీనిపైనే చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు ఛాన్స్ దక్కింది. టిడిపి నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కగా.. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి దక్కింది. బిజెపి నుంచి నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రి పదవి దక్కింది. టిడిపి, బిజెపిల నుంచి ఎంపీలకు ఛాన్స్ వచ్చినా.. జనసేనకు ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్న.
ఈనెల 4న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. క్యాబినెట్ కూర్పు పై చర్చించారు. కానీ జనసేనకు మాత్రం మంత్రి పదవులు దక్కలేదు. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కనీసం సహాయ మంత్రి అయినా ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఏపీ నుంచి ఆ రెండు పార్టీలకే పరిమితం చేశారు కేంద్ర పెద్దలు.
అయితే ఇప్పటికే పవన్ కు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని చేరవేశారని తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పు విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నట్లు సమాచారం. ఐదు ఎంపీ స్థానాలు దాటిన భాగస్వామ్య పార్టీలకే తొలి విడత మంత్రి పదవులు కేటాయించామని.. అందులో భాగంగానే జనసేనకు కేటాయించడం లేదని పవన్ కు కేంద్ర పెద్దలు వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్లో చేరిక విషయంలో సైతం పవన్ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని.. రాష్ట్రానికి సింహభాగం ప్రయోజనాలను కల్పించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో జనసేనకు చాన్స్ ఇస్తారని, నాగబాబు వంటి వారికి రాజ్యసభకు పంపిస్తారని, అప్పుడే జనసేనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇస్తారని సమాచారం. మొత్తానికి అయితే కేంద్ర క్యాబినెట్లో జనసేనకు చోటు దక్కకపోవడం మాత్రం చర్చకు దారితీసింది.