కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూతురు. గత ఎన్నికల ముందు వరకు కూడా ఆమె నిజామాబాద్ ఎంపీగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్తి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెకు ఆ మధ్య కేబినెట్‌లో స్థానం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. కేసీఆర్ చేసే రాజకీయాలు వేరే కదా. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కేబినెట్‌లోనే ఉన్నారంటూ దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలకు మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి కవిత ఏ పదవీ లేకుండానే ఉండిపోయారు.
Also Read: దుబ్బాకలో కాంగ్రెస్ గెలుస్తుందా..? బలాబలాలు ఏమిటీ
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉండడంతో అక్కడి నుంచి ఆమెను బరిలోకి దింపుతున్నారు. ఈ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక ప్రక్రియ వాయిదా వేసింది.
ఈనెల 9న నిజామాబాద్ స్తానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ స్థానంలో 824 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా సోకిన ప్రజాప్రతినిధులు పోస్టల్ బ్యాలెట్ లేదా చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఈ 12న లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: కేసీఆర్ తో పెట్టుకున్న సీనియర్ ఐపీఎస్ కు చుక్కలట?
రేపు జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల మాటమేగానీ టీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఆర్భాటం ఎక్కువ చూపుతున్నారు. కవితను ఎలాగైనా ఎమ్మెల్సీ చేయాలనే కసితో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు. పక్క పార్టీలను పూర్తిగా ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ స్థానానికి టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి 824 మంది ఉండగా.. అందులో 494 మంది అంటే 60 శాతం మంది రూలింగ్ పార్టీ వారే ఉన్నారు. అయినా.. ఆపరేషన్ ఆకర్ష్ నడిపిస్తూనే ఉన్నారు.