
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఇలాంటి క్లిష్ట సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా బిజెపిని ఇరకాటంలో పడవేస్తున్నది. ఎక్కువగా రుణాలు ఎగవేస్తినా వారి 50 మంది జాబితా ప్రకటించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభలో కోరగా అందుకు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నిరాకరించారు.
అయితే ఇప్పుడు ఈ జాబితాను సమాచార హక్కు చట్టం క్రింద ఆర్‌బీఐ ప్రకటించడం బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తున్నది. వీరిలో అత్యధికులు బిజెపికి సన్నిహితులని స్వయంగా రాహుల్ గాంధీ ఆరోపించడమే అందుకు కారణం. ప్రకటించిన 50 మందికి సంబంధించి రూ.68,607 కోట్ల రుణాలను సాంకేతికంగా మాఫీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకుల్లో బకాయిపడ్డ రూ.68,607 కోట్ల రుణాలను నిలిపివేసినట్లు ఆర్బీఐ సమాధానంగా చెప్పింది.
రుణాలు తీసుకుని ఎగవేసిన టాప్-50 కార్పొరేట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా వదిలించుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 వరకు రూ.68,607 కోట్ల కార్పొరేట్ రుణ బకాయిలను దేశీయంగా బ్యాంకులు రద్దు చేశాయి. వీటిలో మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాకు చెందిన సంస్థలతోపాటు దక్కన్ క్రానికల్ తదితర సంస్థల బాకీలున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపిన వివరాల ప్రకారం చోక్సీ (పీఎన్‌బీ కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరు)కి చెందిన గీతాంజలి జెమ్స్, గిల్లీ ఇండియా, నక్షత్ర బ్రాండ్ బకాయిలు అత్యధికంగా రూ.8,048 కోట్లు రద్దు కావడం గమనార్హం.
ఆ తర్వాత ఆర్‌ఈఐ అగ్రో రూ.4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ.4,076 కోట్లున్నాయి. అలాగే రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,850 కోట్లు, కుడోస్ కెమీ లిమిటెడ్ రూ.2,326 కోట్లు, రుచి సోయా రూ.2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ.2,012 కోట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు ఆర్బీఐ చెప్పింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.1,943 కోట్లు, ఫరెవర్ ప్రీషియస్ జ్యుయెల్లరీ అండ్ డైమండ్స్ రూ.1,962 కోట్లు, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్ల బకాయిలు కూడా రద్దయ్యాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16 దాకా ఉన్న వివరాలను తెలుపాలంటూ తన దరఖాస్తులో ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఆర్బీఐని కోరారు. అయితే నిరుడు సెప్టెంబర్ 30 వరకున్న సమాచారాన్నే ఆర్బీఐ అందించింది. ఫిబ్రవరి 16దాకా సమాచారం లేదని స్పష్టం చేసింది. ఇదిలావుంటే రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలు, వాటి యజమానులపై సీబీఐ, ఈడీల దర్యాప్తులు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై రాహుల్ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెప్పడానికి నిరాకరించడంతో తాను అదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించానని గోఖలే ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఆర్‌బీఐ వెల్లడించిన జాబితాలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితర బీజేపీ సన్నిహితులు ఉన్నారని, అందుకే ప్రభుత్వం పార్లమెంట్‌లో వాస్తవాలను కప్పిపుచ్చిందని రాహుల్ ట్వీట్ చేశారు.