Homeజాతీయ వార్తలుModi Cabinet Reshuffle 2023: కేంద్ర క్యాబినెట్ నుంచి నిర్మల సీతారామన్ అవుట్: పునర్వ్యవస్థీకరణలో మార్పులు...

Modi Cabinet Reshuffle 2023: కేంద్ర క్యాబినెట్ నుంచి నిర్మల సీతారామన్ అవుట్: పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులు

Modi Cabinet Reshuffle 2023: 2024 పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. అంతేకాదు త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ ను పూర్తి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మల సీతారామన్ కు తమిళనాడులో, ఉద్వాసనకు గురైన మిగతా మంత్రులకు వేరువేరు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే కేంద్ర మంత్రిమండలి విస్తృత స్థాయి సమావేశం తర్వాత క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని భారతీయ జనతా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సోమవారం కేంద్ర కేబినెట్ భేటీ ముఖ్యగానే అందులో తీసుకున్న నిర్ణయం ప్రకారం పలువురు మంత్రులు బుధవారం రాజీనామాలు చేస్తారని తెలుస్తోంది.. కేవలం ఈ నిర్ణయం మాత్రమే కాకుండా పలు రాష్ట్రాలకు, పార్టీ శాఖలకు కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నిత్యం జనాల్లో ఉండే వారికే ఈసారి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు కేంద్ర క్యాబినెట్లో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఆర్థిక శాఖ నుంచి నిర్మలను తప్పించి, ఆమె స్థానంలో జనాకర్షక, ప్రజా సంక్షేమ విధానాలను రూపొందించేవారిని నియమించాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలిసింది. విద్యా మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒడిశా బాధ్యతలు, వ్యవసాయమంత్రి నరేంద్రతోమర్‌కు మధ్యప్రదేశ్‌ బాధ్యతలు.. బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న ప్రహ్లాద్‌ జోషికి కర్ణాటక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు రాజస్థాన్‌లో ఎన్నికల బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదం నేపథ్యంలో.. అశ్వినీ వైష్ణవ్‌ను రైల్వే శాఖ నుంచి తప్పించి ఐటీ, కమ్యూనికేషన్లకు పరిమితం చేయవచ్చనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో..

ఇక తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను మళ్ళీ పార్టీ బాధ్యతలు స్వీకరించబోనని కిషన్ రెడ్డి అమిత్ షా కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? బండి సంజయ్ ని కొనసాగిస్తారా? లేక కిషన్ రెడ్డికి అధిష్టానం సర్ది చెబుతుందా? అనేది తేలాల్సి ఉంది. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులపై నిర్ణయాలు జరిగాయని, తెలంగాణపై కూడా ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కిషన్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన పక్షంలో.. సీనియర్‌ నేత లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే.. శనివారం జరిగిన రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మణ్‌ను మరో 2-3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ నేతలు ఆదేశించినట్లు తెలిసింది. అలాగే, ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్‌ యాదవ్‌ను బీజేపీ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని పార్టీ వర్గాలు తెలిపాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version