Paddy Farmers- Millers: రైతుల పంట మిల్లర్ల పాలు: కిసాన్ సర్కార్ ఏలుబడి ఘనత ఇదీ

ఇదిలాఉండగా... 2022 వానాకాలం సీజన్‌లో ఈ ఆరు రైస్‌మిల్లులకు కలిపి 10,351 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అలాట్మెంట్‌ చేశారు. 67 శాతం రికవరీ చొప్పున 6,935 మెట్రిక్‌ టన్నుల(69,350 క్వింటాళ్ల) బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇంతవరకు ఒక్క బియ్యం గింజ కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ ఇవ్వలేదు. ఈ బియ్యం విలువ రూ. 27 కోట్లు ఉంటుంది.

Written By: Bhaskar, Updated On : July 2, 2023 1:52 pm

Paddy Farmers- Millers

Follow us on

Paddy Farmers- Millers: ఇంటిల్లిపాది కష్టపడితే తప్ప పంట చేతికి రాదు. ఆ పంటను పండించాలంటే అన్నదాతలు ఎన్నో ప్రయాసలకు గురవుతారు. వేలకు వేలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడతారు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయానికి మిల్లర్లు వారిని దోచుకుంటున్నారు. అంతేకాదు పంట కొనే సమయంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ముజేతి కంకణమే అయినప్పటికీ ప్రభుత్వం మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా వారికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనివల్ల అన్నదాతలు నిండా మునుగుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తేమ, తాలు, తరుగు పేరుతో ఈ సీజన్లో మిల్లర్లు 1200 కోట్లను దోచుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ మిల్లర్లలో అధిక శాతం అధికార పార్టీకి చెందినవారు ఉండడంతో ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో వీరు పార్టీకి ఫండ్ ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా చోద్యం చూసిందని ప్రచారం జరుగుతోంది.

ఇక ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సంబంధించి మిల్లర్లకు తరలించే విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించింది. తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే బియ్యం సేకరించే బాధ్యత అప్పగించింది..ఇందులోనూ లెవీ లక్ష్యాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సాధారణంగా ఒక సీజన్‌లో కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి డెలివరీ ఇస్తేనే, లేదూ.. దాంట్లో కనీసం 50శాతం డెలివరీ చేస్తేనైనా సదరు మిల్లుకు మరో సీజన్‌ కోసం ధాన్యం కేటాయింపులు చేయాలి. లేకపోతే బ్లాక్‌ లిస్టులో పెట్టి ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాలి. ఇదీ నిబంధన. కానీ తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అలా చేయటంలేదు. మిల్లర్లు ధాన్యాన్ని ఆడించకపోయినా, బియ్యం ఇవ్వక పోయినా, బ్లాక్‌ మార్కెట్లో ధాన్యం అమ్ముకుంటున్నా చోద్యం చూస్తోంది. ఇందుకు ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకే ప్రాంతంలో ఆరు రైస్‌మిల్లుల బాగోతమే నిలువెత్తు నిదర్శనం..ఏకంగా రూ. 173 కోట్ల విలువైన 45వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఒకే యజమాని దగ్గర ఇరుక్కుపోయింది! ఇందులో ఒక్క గింజ కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయకపోవటం శోచనీయం.

వాస్తవానికి పూర్తి దట్టమైన ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులు వరి పంట దాదాపుగా సాగుచేయరు. ఇక్కడ కేవలం సోయా పంట మాత్రమే రికార్డు స్థాయిలో సాగు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సోయాలో ఇక్కడే 80 శాతం వరకు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట రైస్‌ మిల్లులు నెలకొల్పటమే వింత. పైగా రైస్‌మిల్‌ ఇండస్ట్రీలో ఉన్నంత లాభం ఏ ఇండస్ట్రీలో లేదని గ్రహించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నేతలు.. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో రైస్‌మిల్లులు స్థాపించడం ఇక్కడ విశేషం. ప్రభుత్వమిచ్చిన ధాన్యం అమ్ముకోవటం, వీలైనపుడు పీడీఎస్‌ బియ్యం కొని రీ- సైక్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అప్పగించటం సులువైపోయింది. ఈక్రమంలోనే ఆదిలాబాద్‌లో ఒకే ప్రాంతంలో ఆరు రైస్‌మిల్లులు వెలిశాయి. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం రాంపూర్‌ చిరునామాతో వెంకటేశ్వర్‌ రావు ఇండస్ట్రీస్‌, సీతారామ్‌ ఇండస్ట్రీస్‌, బాలాజీ ఇండస్ట్రీస్‌… తాంసి మండలం పొన్నారి చిరునామాతో మారుతీ ఇండస్ట్రీస్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌ చిరునామాతో నవీన్‌ ఇండస్ట్రీస్‌, మావల మండలం బట్టి సావర్గావ్‌ చిరునామాతో రాజు ఇండస్ట్రీస్‌.. ఇలా ఆరు రైస్‌మిల్లులకు అనుమతి తీసుకున్నారు. అయితే ఈ మిల్లులకు ఒకే యజమాని అని, అయితే డ్రైవర్లు, మునీమ్‌ల పేర్లతో ఆరింటికి అనుమతులు తీసుకొని రాంపూర్‌ శివారులో దందా నడిపిస్తున్నారనేది పౌరసరఫరాల సంస్థలో బహిరంగ రహస్యం.జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అందరు అధికారుల సహకారం ఉండటంతో కేటాయింపులు చకచకా జరిగిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు టన్నుల కెపాసిటీ రైస్‌మిల్లులు వేయటమే ఎక్కువ! కానీ ఈ ఆరు కొత్త రైస్‌మిల్లులకు… 4 టన్నుల కెపాసిటీకి అనుమతిస్తూ ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

10,351 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అలాట్మెంట్‌

ఇదిలాఉండగా… 2022 వానాకాలం సీజన్‌లో ఈ ఆరు రైస్‌మిల్లులకు కలిపి 10,351 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అలాట్మెంట్‌ చేశారు. 67 శాతం రికవరీ చొప్పున 6,935 మెట్రిక్‌ టన్నుల(69,350 క్వింటాళ్ల) బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇంతవరకు ఒక్క బియ్యం గింజ కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ ఇవ్వలేదు. ఈ బియ్యం విలువ రూ. 27 కోట్లు ఉంటుంది. ఇప్పుడీ భారమంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై పడుతోంది. ఖరీఫ్‌ బకాయిలు ఉండగానే తర్వాత వచ్చిన యాసంగి సీజన్‌లో 55,734 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఈ ఆరు రైస్‌మిల్లులకే అలాట్మెంట్‌ చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి 37,342 టన్నుల (3,73,420 క్వింటాళ్లు) బియ్యం ఇవ్వాలి. కానీ ఇంతవరకు మిల్లింగే ప్రారంభించ లేదు. ఒక్క గింజ కూడా సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వలేదు. ఈ బియ్యం విలువ రూ. 146 కోట్లు. అంటే రెండు సీజన్ల లో కలిపి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు రైస్‌మిల్లుల్లో రూ. 173 కోట్ల విలువైన బియ్యం ఇరుక్కుపోవటం గమనార్హం. ఈ బియ్యం రికవరీ చేయటానికి అధికారులు తాత్సారం చేస్తుండగా… 66 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సదరు మిల్లుల్లో కనిపించటంలేదని, బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.