Nimmagadda Ramesh Kumar: “సుదీర్ఘ పోరాటం తర్వాత ఇటీవలే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు పొందారు. ఏపీ మాజీ ఎలక్షన్ కమిషనర్ అయిన రమేష్ కుమార్ కృష్ణాజిల్లాలోని తన స్వగ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓ ఎన్నికల అధికారే నెలల తరబడి ఓటు కోసం పోరాడాల్సి వచ్చింది. కేవలం రాజకీయ పరిణామాలతోనే ఆయనకు ఓటు లభించడంలో జాప్యం జరిగిందనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా సుప్రీంకోర్టు నే ఆశ్రయించారు. తన ఓటు కోసం కాదండోయ్.. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల మాజీ అధికారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
ఇటీవలే సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను స్థాపించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రభుత్వాల ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలపై పోరాడడం ప్రారంభించారు. అందులో భాగంగా ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.గతంలో ఆయనకు ఓటు హక్కు ఇవ్వడానికి ఏపీలో నిరాకరించారు. హైకోర్టుకు వెళ్లి తన ఓటును నమోదు చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం విశేషం.
నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాహి ధర్మసనం ముందుకు వచ్చింది. కానీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్ అన్నారు. దీనిపై న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేమీ రాజకీయపరమైన కేసు కాదు. ప్రజాస్వామ్య బద్ధమైన కేసు. ఏపీలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా ఓటర్ల జాబితాలు రెడీ అవుతున్నాయని.. వీరంతా వైసీపీ సానుభూతిపరులేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారని.. చివరకు రాజకీయ వ్యూహకర్తలైన ఐపాక్ బృందం సైతం ఇందులో పాలుపంచుకుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సిజెఐ ఆదేశాలతో పిటిషన్ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బి.ఆర్ గవాయి సూచించారు. త్వరలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో ఓటర్ల జాబితా పై.. ఓ ఎన్నికల మాజీ అధికారి పోరాటానికి దిగడం ఆసక్తి రేపుతోంది.