Gurpatwant Singh Pannun: భారత్ పై ఖలిస్థానీ కుట్ర.. ఏకంగా అంతకు తెగించాడు

1947లో విభజన సమయంలో పన్నూన్ కుటుంబం పంజాబ్ లోని అమృత్ సర్ కు వచ్చింది. ఇతడి కుటుంబం పాకిస్తాన్ లోని ఖాన్ కోట్ అనే గ్రామానికి చెందినదని సమాచారం.

Written By: K.R, Updated On : September 26, 2023 1:49 pm

Gurpatwant Singh Pannun

Follow us on

Gurpatwant Singh Pannun: భారత్ ను చూసి ఖలిస్థానీ వాదులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అనేక ఆటుపోట్లను ఎదిరించి ఎదుగుతున్న ఈ దేశాన్ని ముక్కలు చేయాలని తలపోస్తున్నారు. మనదేశంలో పుట్టి తమ వేర్పాటువాద రాజకీయాల కోసం ఇతర దేశాల్లో నక్కి సంఘవిద్రోహ పనులకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవాలని హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్ గురించి, అతడు చేస్తున్న పన్నాగాల గురించి సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలనే భారీ కుట్ర పన్నినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజా నివేదిక తెలిపింది.. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతడు సవాల్ చేసినట్టు ఆడియో మెసేజ్ ల ద్వారా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాశ్మీర్ ప్రజల కోసం ఒక దేశం ఏర్పాటు చేయాలని, దానికి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దూస్తాన్ అనే పేరు పెట్టాలని పన్నూన్ కుట్ర పన్నాడని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

ఎవరీ పన్నూన్

1947లో విభజన సమయంలో పన్నూన్ కుటుంబం పంజాబ్ లోని అమృత్ సర్ కు వచ్చింది. ఇతడి కుటుంబం పాకిస్తాన్ లోని ఖాన్ కోట్ అనే గ్రామానికి చెందినదని సమాచారం. ఇతడి తల్లిదండ్రులు చనిపోయారు. అతడి సోదరుడు మగ్వంత్ సింగ్ విదేశాల్లో నివసిస్తున్నాడు. పన్నూన్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థకు అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. తీవ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు, ఖలిస్థాన్ స్వతంత్ర రాష్ట్రం కోసం పోరాటం చేసేందుకు ఆ ఉగ్రవాద సంస్థ పంజాబ్ లోని యువతను ప్రేరేపిస్తోంది. పంజాబ్ సహాబ్ దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయడానికి ఇతడు ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది.

పన్నూన్ పై పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో 16 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో తొమ్మిది చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద నమోదయ్యాయి.. ఇతడిపై పంజాబ్లోనే మూడు దేశద్రోహంతో పాటు, ఇతర ప్రత్యేక కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇండియా గేట్ వద్ద ఖలిస్థానీ జెండాను ఎగరవేసేవారికి 2.5 మిలియన్ డాలర్ల అందిస్తానని అతడు ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీస్ సిబ్బందికి మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ఆఫర్ చేసినట్టు ఎన్ఐఏ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు భారత్, కెనడా మధ్య దౌత్యబివాదం సాగుతున్న తరుణంలోనే పన్నూన్ భారతీయ దౌత్య వేత్తలను, ప్రభుత్వ అధికారులను బెదిరించాడు. కెనడాలో ఉన్న హిందువులను దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు.. ఈ క్రమంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చండీగఢ్ అతడి ఇంటిని, అమృత్ సర్ లోని వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే ఆ ఆస్తులపై అతనికి హక్కులు లేనట్టే. ఇక 2020 జూలైలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. తగిన సమాచారం లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత ప్రభుత్వ అభ్యర్థనను ఇంటర్ పోల్ తిరస్కరించింది.