ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో ఎన్నికలే ప్రధాన భూమిక పోషిస్తాయి. ఈనేపథ్యంలో దేశాన్ని పరిపాలించే వారిపై ఓ సర్వే నిర్వహించారు. అందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎన్నేళ్లయినా ప్రధాని నరేంద్రమోడీ చరిష్మా తగ్గడం లేదు. దీంతో దేశం యావత్తు ఆయన వెంటే నడుస్తోందని తెలుస్తోంది.
ఓ పక్క అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చోటుచేసుకుంటున్నా మోడీ క్రేజీ ఏ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. దేశంలో 18 పార్టీల భాగస్వామ్యం ఉన్నా చివరికి గెలిచేది మాత్రం ఏ పార్టీ అనేది అందరికీ తెలిసిందే. దేశ రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందిన నాయకుడెవరు? అనే దానిపై ప్రశ్నం అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. దేశ రాజకీయాలను శాసించే శక్తి ఎవరికి ఉందని ఆరా తీసింది. ఇందులో పలు విషయాలు వెలుగు చూశాయి.
12 పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, కర్నాటక, గుజరాత్ , పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్,బీహార్, కేరళ, జార్ఖండ్ ల్లో 397 ఎంపీ నియోజకవర్గాలు, 2309 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 వేల మందిని సర్వే చేసింది. ఇందులో 33 శాతం మంది ప్రజలు మోడీకే పట్టం కట్టారు. నోట్ల రద్దు నుంచి కరోనా వరకు ఎన్ని సమస్యలెదుర్కొన్నా మోడీకే జనం మద్దతు పలకడం గమనార్హం. రాహుల్ గాంధీకి కేవలం 17 శాతం ప్రజలు మొగ్గు చూపారు.
పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ విజయంతో ఆమె స్థాయి పెరిగిందని భావించినా ఆమెకు 7 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కేవలం 6 శాతం మంది ప్రజలే జై కొట్టారు. జాతీయ రాజకీయాలు శాసిస్తానన్న కేసీఆర్ కు కేవలం 0.7 శాతం మంది ప్రజలే సై అన్నారు.