Hyderabad Vijayawada Third Rail Line: ఎన్నాళ్ళో వేచి ఉన్న ఉదయం వెంటనే ఎదురైనట్టు.. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే లైన్ ల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చనుంది. దీనివల్ల రైల్వే శాఖకు సరుకు రవాణా తో పాటు, ప్రయాణికుల చేరవేత కూడా సులభతరం కానున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలోని ప్రధాన నగరం అయిన విజయవాడ కు దగ్గరి దారి ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ 1800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిపి 145 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెబుతోంది.

ప్రస్తుతం గూడ్స్ రైల్వే రాకపోకలు సాగిస్తున్నాయి
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి నుంచి విష్ణుపురం, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సెక్షన్ల రైల్వే లైన్ విస్తరణ ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉంది. పలుమార్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఏటా రైల్వే బడ్జెట్లో మొండి చెయ్యే చూపింది. వాణిజ్య పరంగా, ప్రయాణికుల పరంగా ఈ రైల్వే లైన్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఈ మార్గాన్ని తమకు అత్యంత కీలకంగా అభివర్ణిస్తుంటారు. ఈ క్రమంలో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీని విస్తరణకు ఎంత ఖర్చవుతుందో ప్రాథమికంగా అప్పట్లోనే లెక్క కట్టింది. అయితే కోవిడ్ ప్రబలిన మొదటి దశలో ప్రయాణికుల రైళ్లను నిలుపుదల చేయడంతో ప్రాథమికంగా అప్పుడే సర్వే నిర్వహించింది. ఈ రెండు సెక్షన్ల మధ్య డంబ్లింగ్ సర్వే కూడా పూర్తి చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి పంపించాలని రైల్వే బోర్డు ఆదేశించింది.
డిపిఆర్ కు ఒకవేళ రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రెండు లైన్లు ప్రాజెక్టు నిర్మాణానికి తుది ఆమోదం లభిస్తుంది. మోటమర్రి _ విష్ణుపురం మధ్య ప్రస్తుతం సింగిల్ లైన్ లో గూడ్స్ రైళ్ల రాకపోకలు మాత్రమే సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో రెండవ లైన్ నిర్మిస్తే ప్యాసింజర్ రైళ్ళు నడిచేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం డోర్నకల్, భద్రాచలం రోడ్డు, మణుగూరు సెక్షన్ సింగిల్ లైన్ లో ప్రయాణికుల రైళ్లతోపాటు గూడ్స్ బండ్లూ నడుస్తున్నాయి. ఈ సెక్షన్లో వాణిజ్య అవసరాలు ఎక్కువగా ఉండటంతో పరిమితికి మించి దక్షిణ మధ్య రైల్వే రైళ్లను నడుపుతోంది. దీనివల్ల ఈ లైన్ పై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. డోర్నకల్, మోటమర్రి మధ్య రెండు లైన్ల రైలు మార్గం ఉంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు, కాజీపేట, డోర్నకల్, మోటమర్రి మీదుగా ఒక మార్గం.. నల్లగొండ, విష్ణుపురం, గుంటూరు మీదుగా మరో మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు సెక్షన్లను మోటమర్రి, విష్ణుపురం సెక్షన్ అనుసంధానిస్తుంది. ఇక ఈ సెక్షన్లో రెండవ లైన్ నిర్మిస్తే ప్రయాణికుల రైళ్లు నడిపించవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్, విజయవాడ మధ్య రైలు ప్రయాణం 40 నుంచి 50 కిలోమీటర్లు తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు బొగ్గు రవాణా
నల్గొండ జిల్లాలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ కు సమీపంలో దామరచర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు మణుగూరు, భద్రాచలం రోడ్డు చుట్టుపక్కల సింగరేణి గనుల నుంచి రానుంది. బొగ్గు రవాణాకు నిత్యం 14 గూడ్స్ బండ్ల అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో భద్రాచలం రోడ్డు_ డోర్నకల్, మోటమర్రి_ విష్ణుపురం శిక్షణను డంబ్లింగ్ చేయాలని జెన్కో దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరింది. అయితే ఈ క్రమంలో ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. డిపిఆర్ తో నిర్మాణ వ్యయంపై ఒక స్పష్టత వస్తే.. మార్గంలో ఎన్ని వంతెనలు నిర్మించాలి, చేయాల్సిన భూ సేకరణ, కిలోమీటర్ కు అయ్యే నిర్మాణ వ్యయం, ప్రాజెక్టు వ్యయం పై వచ్చే ఆదాయం వంటి వివరాలు తెలుస్తాయి. కాగా ఈ రైల్వే లైన్ పైనే యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉందని రైల్వే రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ రైల్వేలైన్ పూర్తయితే దక్షిణ మధ్య రైల్వే లోనే గేమ్ చేంజ్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.