Narendra Modi : నరేంద్ర మోదీ అపర చాణక్యుడు.. అందుకే 130 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేశాడు. రెండు పర్యాయాలు కేవలం తన చరిష్మాతోనే భారతీయ జనతాపార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. మూడోసారి 400 సీట్లతో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వికసిత్ భారత్ నినాదంతో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి అందకుండా చాణక్యం ప్రదర్శిస్తున్నారు.
ఏపీలోనూ..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా మోదీ తనదైన చాణక్యం ప్రదర్శించారు. ఏపీలో తనకు పొత్తు అవసరం లేకున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలవంతంగా బీజేపీని పొత్తులోకి లాగారు. ఇక ఏపీపై ఎలాంటి ఆశలు లేని బీజేపీ.. టీడీపీ, జనసేన పిలిచి సీట్లు ఇస్తామంటే కాదనడం ఎందుకు అన్నట్లుగా వ్యవహరించింది. 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంది. ఇందులో నాలుగైదు రాకపోతాయా అన్న ఆలోచనతో పొత్తుకు ఓకే చెప్పింది.
కూటమి తొలి సభ..
ఇక బీజేపీ–టీడీపీ–జనసేన జట్టు కట్టాక తొలిసభ రెండు రోజుల క్రితం చిలకలూరిపేటలో నిర్వహించారు.ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధాని వస్తే తమ కూటమికి మరింత లాభం కలుగుతుందని టీడీపీ–జనసేన భావించాయి. అయితే ఇక్కడే మోదీ మరోమారు తన చాణక్యం ప్రదర్శించారు. సభకు హాజరైన ప్రధాని ఇటు కూటమిని పొగిడారు. గెలిపించాలని కోరారు. అయితే అదే సమయంలో అధికార వైసీపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఇదే ఏపీలో చర్చనీయాంశమైంది.
ఐదేళ్లు సంపూర్ణ మద్దతు..
ఏపీలోని అధికార వైసీపీ ఐదేళ్లు బీజేపీ ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి ప్రతీ విషయంలో మోదీ సర్కార్‌కు మద్దతుగా నిలిచింది. ప్రతీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. భారత దేశంలో బీజేపీకి అనుబంధంగా లేకుండా, ఎన్డీఏలో చేరకుండా ప్రతీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీసీ. ఈమేరకు దానిపై కృతజ్ఞతను చూపారు మోదీ. 25 ఎంపీలు ఉన్న వైసీపీని నామ మాత్రంగా విమర్శించారు. భవిష్యత్‌లో అవసరం పడినా ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు.
మొత్తంగా మోదీ చాణక్యం ఏపీలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.