Congress List : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే 300పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి విపక్ష ఇండియా కూటమికి అందకుండా దూసుకుపోతోంది. దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో 400 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తోంది. ఇక ప్రధాని నరేంద్రమోదీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా దక్షిణభారత దేశంపైఈసారి గురిపెట్టారు. ఇక్కడి నుంచి ఈసారి కనీసం 30 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు.
దూకుడు పెంచిన కాంగ్రెస్..
మోదీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఇన్నాళ్లు పొత్తులు, సీట్ల పంపకాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనపై దృష్టిపెట్టింది. తొలి జాబితాలో 39 సీట్లుకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో రెండో జాబితాలో తెలంగాణలోని మిగతా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం స్పీడ్ పెంచాలని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్..
తెలంగాణలో గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. అంతకు ముందు కర్ణాటకలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో సౌత్‌లో ఎక్కువ సీట్లు సాధించే రాష్ట్రాలుగా వీటిని ఎంచుకుంది. దీంతో రెండో జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్‌ను పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు రేవంత్ సర్కార్ తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలిచి రాహుల్‌గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. కనీసం 13 స్థాతనాల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు.
టికెట్లపై ఉత్కంఠ..
ఇక మంగళవారం(మార్చి 19న) కాంగ్రెస్ రెండో లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు సీఈసీ భేటీ కానుంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే అభ్యర్థుల ప్రకటనపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున ఫనల్ చేసి అధిష్టానానికి పంపింది టీపీసీసీ. ఇందులో కొన్ని మార్పులు చేసి లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో నేతలు ఎవరికి టికెట్ వస్తుందో అని టెన్షన్ పడుతన్నారు.
మేనిఫెస్టో రూపకల్పన..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా సిద్దం చేస్తోంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గ్యారంటీ హామీలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ గ్యారంటీలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పనపైనా మంగళ, బుధవారాల్లో చర్చించే అవకాశం ఉంది.