Nara Lokesh: జగన్ ను అరెస్టు చేయించు లోకేష్

ఇప్పటికే ఏపీ గంజాయి వనంగా మారిందని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలోనే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబట్టడం.. ఇదో రాజకీయ అంశంగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : March 22, 2024 10:40 am

Nara Lokesh

Follow us on

Nara Lokesh: అంతర్జాతీయ స్థాయిలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును విశాఖలో సీబీఐ అధికారులు రట్టు చేశారు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. సిబిఐ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేసి మరి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో దాదాపు మూడు రోజులపాటు శ్రమించి డ్రగ్స్ ను పట్టుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయం కావడంతో ఇదో రాజకీయ అంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ సర్కార్ పై ముప్పేట దాడి ప్రారంభమైంది. ఏపీని మత్తుపదార్థాల అడ్డగా మార్చారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. విశాఖలో పట్టుబట్టడంతో డ్రగ్స్ రాజధానిగా ఏపీని మార్చారని తాజాగా నారా లోకేష్ ఆరోపణ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయననే అనుసరిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీ గంజాయి వనంగా మారిందని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలోనే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబట్టడం.. ఇదో రాజకీయ అంశంగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుండడం విశేషం. అయితే ఇటీవల తీర ప్రాంతాల్లో,పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడుతుండడం సర్వసాధారణంగా మారింది.మొన్న ఆ మధ్యన గుజరాత్లో, తరువాత పంజాబ్ లో డ్రగ్స్ పట్టుబడింది. కానీ ఇందులో ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ ఏపీలో మాత్రం ఇలా డ్రగ్స్ పట్టుబడిందో లేదో అప్పుడే విమర్శలు ప్రారంభించారు. ఏకంగా సీఎం జగన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు సంబంధం ఉంటే అది ముమ్మాటికీ అర్హతతో కూడిన డిమాండ్. కానీ కేవలం రాజకీయ కోణంలో ఇలా ఆరోపణలు చేస్తుండడం మాత్రం ఈ రాష్ట్రానికి క్షేమం కాదు.

ఈ డ్రగ్స్ మూలాలు బ్రెజిల్ లో ఉన్నాయి. కంటైనర్ అడ్రస్ విశాఖ కంపెనీ గా ఉంది. పెద్ద ఎత్తున డ్రగ్స్ తెస్తున్నారని ఇంటర్ పోల్ సమాచారం ఇచ్చింది. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద డ్రగ్స్ కుంభకోణం. ఇందులో పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? అన్నది తేలాల్సి ఉంది. కానీ ఇంతలోనే తెలుగుదేశం పార్టీ రాజకీయ ఆరోపణలు చేయడం మాత్రం సమంజసంగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్న ఎత్తుగడగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ ఈ తరహా ఆరోపణలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఎన్డీఏలో టిడిపి చేరింది. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేపడుతోంది. ఇటువంటి సమయంలో కేంద్రంతో చెప్పించి జగన్ను అరెస్టు చేయించవచ్చు కదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సహేతుకం కాదని.. ఇది జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువును పోగొట్టడమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు సహేతుకంగా ఉండాలని సూచిస్తున్నారు. మున్ముందు ఇలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు మరెన్ని చూడాలో?