Balakrishna: నందమూరి బాలకృష్ణను పక్కన పెట్టారా? ఆయన కుమార్తె బ్రాహ్మణీని సైతం సైడ్ చేశారా? అదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందా? జైలు నుంచి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ చాలా యాక్టివ్ గా పని చేశారు. అటు నారా బ్రాహ్మణి సైతం హెరిటేజ్ కార్యకలాపాలను విడిచిపెట్టి మరి మామ కోసం గట్టిగానే పోరాడారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బాలకృష్ణ కనిపించకుండా పోయారు. బ్రాహ్మణి ఊసు లేకుండా పోయింది. దీంతో కొత్త చర్చ ప్రారంభమైంది.
నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్ళనున్నారు.” నిజం గెలవాలి” పేరుతో చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. వారానికి రెండు మూడు రోజుల పాటు ఆమె పర్యటన ఉండనుంది. తొలుత భువనేశ్వరి స్థానంలో బ్రాహ్మణిని తేవాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఎల్లో మీడియా సైతం దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బ్రాహ్మణి అయితే అటు నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు బ్రాహ్మణి కాకుండా భువనేశ్వరికి పార్టీ ఎనలేని ప్రాధాన్యమిస్తుండటం.. ఎల్లో మీడియా సైతం విస్తృతమైన ప్రచారం కల్పిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజకీయాల్లోకి బ్రాహ్మణి వస్తే లోకేష్ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపించింది. లోకేష్ కంటే బ్రాహ్మణి ప్రజాకర్షణ కలిగిన నాయకురాలిగా మారతారు అన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ తరుణంలోనే చంద్రబాబు జాగ్రత్త పడినట్లు సమాచారం. భువనేశ్వరిని ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అటు నారా లోకేష్ సైతం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ప్రకటించడం విశేషం.మారిన వ్యూహంతోనే లోకేష్ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలకృష్ణ సైతం హడావిడి చేశారు. అమరావతి లోని కేంద్ర కార్యాలయంలో ఏకంగా చంద్రబాబు కుర్చీలోనే కూర్చొని రివ్యూలు జరిపారు. నేను వస్తున్నాను కాచుకోండి అంటూ సినిమా డైలాగులు చెప్పారు. అటు తెలంగాణ పార్టీ సమీక్షలకు సైతం బాలకృష్ణ హాజరయ్యారు. అయితే ఆయనతో ప్లస్ కంటే మైనస్ అధికమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దానిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను లోకేష్ కు అప్పగించారు. ఇక్కడ కూడా బాలకృష్ణను పరిగణలోకి తీసుకోలేదు. ఒక పద్ధతి ప్రకారం నందమూరి బాలకృష్ణ తో పాటు ఆయన కుమార్తె బ్రాహ్మణిని పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.