Balakrishna: నందమూరి బాలకృష్ణ పవన్ విషయంలో తన మనసులోనున్న మాటను బయటపెట్టేశారు. జనసేన పార్టీ శ్రేణులను ఆలోచింపజేశారు. పవన్ కళ్యాణ్ కు, తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించే ప్రయత్నం చేశారు. గత రెండు రోజులుగా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య సమన్వయ భేటీలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రారంభ ఉపన్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన అందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు పవన్ తమ్ముడని సంబోధించారు. పవన్ కు,తనకు చాలా విషయాల్లో భావ సారూప్యత ఉందని చెప్పుకొచ్చారు. ఇద్దరమూ ముక్కుసూటి మనుషులమేనని తేల్చేశారు. తాము ఎవరికి భయపడబోమని… కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం మా నైజమని.. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
వైసీపీ ఏలుబడిలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి టిడిపి, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. టిడిపి, జనసేన కలవడం ఒక చారిత్రక ఘట్టమన్నారు. నాడు ఎన్టీఆర్ సైతం ఏపీ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య సమన్వయం గురించి మాట్లాడారు. సీట్లు, ఓట్లు లెక్క గురించి కాదు కానీ.. రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలన్న కృత నిశ్చయంతో ఇరు పార్టీల శ్రేణులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రలో.. మహనీయుల ఫోటోలు కింద ఉంటే.. వైసీపీ నేతల ఫోటోలు పైన ఉన్నాయని… ఇదే నా సాధికారత అంటూ బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఇప్పటినుంచి ఎవరిని ఉపేక్షించేది లేదని.. కలిసి ఉద్యమం చేస్తామని.. సమన్వయంతో ముందుకు సాగి ఏపీలో అధికారంలోకి వస్తామని బాలకృష్ణ చెప్పడం విశేషం.